ముంబయి: సినిమా పరిశ్రమలో రంగుకు ఉన్న ఇంపార్టెన్స్ ఇక దేనికీ ఉండదంటారు. తెల్లగా ఉన్నవాళ్లకే అవకాశాలు అనే వాదన ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అయితే చామన ఛాయ ఉన్న అమ్మాయిలు కూడా ఆకట్టుకున్నారు. కానీ కొందరు మాత్రం ఆ రంగు కారణం వెనుకబడిపోయారు. అసలు అవకాశాలే రాకుండా ఇబ్బందులు పడ్డారు. అలా పరిశ్రమలో చామన ఛాయతో ఇబ్బంది పడ్డ కథానాయికల్లో దియా మీర్జా ఒకరు. హైదరాబాద్‌కు చెందిన ఈ అందం 200లో మిస్ ఆసియా పసిఫిక్ అందాల కిరీటం గెలుచుకున్న విషయం తెలిసిందే.
అందాల పురస్కారంతో అందరికీ పరిచయమైన దియా… సినిమాల్లోకి ప్రవేశించింది. అయితే తన కెరీర్ అందరతూ అనుకున్నట్లు సజావుగా సాగలేదంట. 2001లో ‘రెహనా హై తేరే దిల్ మే’తో దియా నటిగా అరంగేట్రం చేసింది. ఆ సమయంలో, ఆ తర్వాత పరిశ్రమలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది దియా. అందం లేని కారణంగా ఎన్నో సినిమాల్లో అవకాశాలు కోల్పోయా అంటూ దియా తన ఇబ్బందుల్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
‘‘చిత్ర పరిశ్రమలో మూస పద్ధతులు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కారణంగా నా లుక్ వల్ల ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా. నా మాటలు విచిత్రంగా అనిపించొచ్చు. కానీ నా చర్మం రంగు… కెరీర్ పరంగా నాకు అడ్డంకే అయ్యింది. ఇండస్ట్రీలో చామన ఛాయలో ఉండే మహిళలు ఇబ్బందులు పడతారని నాకు తెలుసు. నేనూ అలాంటివే ఎదుర్కొన్నాను. చిత్ర పరిశ్రమలోని మూస పద్ధతితో కొన్ని లిమిటేషన్స్ పెట్టుకున్నారు. అందుకే అందరికీ అవకాశాలు రావడం లేదు’’ అని దియా చెప్పింది.
‘‘అంతర్జాతీయ అందాల పోటీలో గెలవడం పెద్ద విషయమే. ఆ విజయం ఇది నాకు గొంతునిచ్చింది. నేను నా మాట వినిపించడానికి వేదికను ఇచ్చింది. ఫైనాన్షియల్‌గా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడింది. చిన్నతనం నుంచి నాకు నటనంటే అమితమైన ఇష్టం. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. ఒకవేళ మిస్ ఆసియా పసిఫిక్ కిరీటం నాకు దక్కకపోయుంటే మరో మార్గంలోనైనా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేదాన్ని’’ అంటూ తన ఆలోచనలు వివరించింది దియా. ఆమె ప్రస్తుతం నాగార్జునతో ‘వైల్డ్ డాగ్’లో నటిస్తోన్న విషయం తెలిసిందే.