అప్పట్లో తన గ్లామర్ తో కుర్ర కారుని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లలో సంఘవి ఒకరు. శ్రీకాంత్ హీరోగా ముప్పలనేని శివ డైరెక్షన్లో వచ్చిన ‘తాజ్ మహాల్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘తాతా మనవడు’ ‘నాయుడుగారి కుటుంబం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఈమెను సెకండ్ హీరోయిన్ గా పడేశారు. అలా అగ్ర హీరోలు.. వెంకటేష్ తో ‘సరదా బుల్లోడు’ ‘సూర్యవంశం’, బాలకృష్ణ తో ‘సమరసింహా రెడ్డి’ ‘గొప్పింటి అల్లుడు’, చిరంజీవి ‘మృగరాజు’, నాగార్జున సీతారామరాజు’ చిత్రాల్లో ఛాన్సులు దక్కించుకుని గుర్తింపు తెచ్చుకుంది.
దీంతో ‘సింధూరం’ సినిమాలో అవకాశం ఇచ్చాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఈ చిత్రం కోసం ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదంటుంది ఈ సీనియర్ హీరోయిన్. సంఘవి మాట్లాడుతూ… “మొదటి నుండీ నాకు నటన పై ఆసక్తి ఉండేది. తొమ్మిదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన తరువాత సెలవుల్లో తమిళంలో ‘అమరావతి’ సినిమాలో నటించాను. అజిత్ హీరోగా నటించిన ఆ సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. నా అసలు పేరు కావ్య. కానీ ఆ చిత్రంతో నన్ను సంఘవి పేరుతో పరిచయం చేశారు. కలిసొచ్చింది కదా అని ఆ పేరునే కంటిన్యూ చేస్తున్నాను. ‘అమరావతి’ సినిమాతో బిజీ అవ్వడం వల్ల పదో తరగతి పూర్తి చేయడం కుదర్లేదు. ఇప్పటివరకూ 99 సినిమాలు చేశాను .. 100వ సినిమాలో మంచి పాత్ర చేయాలనే ఆశతో ఎదురు చూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈమె 100 వ చిత్రం ఆశని ఏ డైరెక్టర్ తీరుస్తాడో చూడాలి..!