కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. దేశంలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుండగా.. మరోపక్క ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కుమారస్వామికి చెందిన జనతాదళ్ కూడా వచ్చే ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సినీ తారలు కూడా తమ రాజకీయ ప్రవేశంతో వార్తల్లో నిలుస్తున్నారు. నటుడు ఉపేంద్ర ఇప్పటికే పార్టీ పెట్టి చాలా హడావిడి చేశారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తరువాత దాని నుంచి బయటకు వచ్చేశారు.
మరో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ను రీసెంట్ గా ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ కలిశారు. దీంతో సుదీప్ రాజకీయాల్లోకి వస్తాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. జేడీఎస్ అధినేత దేవెగౌడ ఇదివరకు సుదీప్ ను తమ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ సుదీప్ వెళ్లలేదు.తన రాజకీయ ప్రవేశంపై సుదీప్ ని ఎప్పుడు ప్రశ్నించినా.. ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ నేతతో జరిగిన మీటింగ్ లో మాత్రం కర్ణాటక రాజాకీయాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం.
సుదీప్ కాంగ్రెస్ లో చేరాలని ఆ పార్టీ ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ రమ్య స్వయంగా సుదీప్ తో సంప్రదింపులు జరిపారు. వచ్చే విధాన సభ ఎన్నికల నాటికి ప్రముఖ సినీ నటులను చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.రమ్యతో భేటీ నిజమేనని వెల్లడించారు సుదీప్. అయితే ఈ విషయంలో సుదీప్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. సుదీప్ రాజకీయాల్లోకి వస్తే వస్తే కర్ణాటక ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం.
ఎందుకంటే సుదీప్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏ పార్టీలో చేరితో ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలు ఎక్కువే కనిపిస్తున్నాయి. అయితే నటుడిగా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు సుదీప్. ఇదివరకు ఆయన తెలుగులో కూడా సినిమాలు చేశారు.