ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్’ పురస్కారాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కారణం ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు..’ పాట ఆస్కార్ నామినేషన్లలో ఉండటమే. అయితే ‘ఆస్కార్’ ఘనతను కె.విశ్వనాథ్ సినిమా గతంలోనే సంపాదించింది తెలుసా? మన దేశం నుండి అఫీషియల్ ఎంట్రీగా వెళ్లినా.. నామినేషన్లలో నిలవలేకపోయింది అనుకోండి. కె.విశ్వనాథ్ – కమల్ హాసన్ కాంబోలో వచ్చిన ‘స్వాతిముత్యం’ సినిమాకే ఈ ఘనత దక్కింది. కమల్ హాసన్, కె.విశ్వనాథ్ కలయికలో తెరకెక్కిన ‘స్వాతిముత్యం’ సినిమా 1985లో విడుదలైంది.
విడుదలైన తొలి రోజు నుండే అశేష ప్రజాదరణ పొందింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తండోపతండాలుగా వచ్చి థియేటర్లలో సినిమా వీక్షించారు. ఆ సినిమాలో హీరో ఓ అమాయకుడు. అలాంటి క్యారెక్టర్ చేయడానికి కమల్ హాసన్ పెద్దగా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఎలాంటి పాత్ర అయినా ఆయనకు కొట్టిన పిండి. అందులోనూ కళాతపస్వి చేస్తున్న సినిమా కాబట్టి ఇంకా నమ్మకం. సినిమా చూశాక కమల్ హాసన్‌కు, రాధికకు, కె.విశ్వనాథ్‌కు ఎంతపేరొచ్చిందో చెప్పడానికి ఎన్ని పేజీలైన చాలవు. అయితే ఆ సినిమాకు దక్కిన ఘనతల్లో ఆస్కార్ ఎంట్ఈర గురించి తప్పక చెప్పుకోవాలి.
అప్పటివరకు భారతదేశంలోని ఇతర భాషల సినిమాలే ఆస్కార్ ఎంట్రీకి సరైనవి అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ‘స్వాతిముత్యం’ సినిమాతో ఆ ముద్ర పోయింది. ఈ సినిమాను మన ప్రభుత్వం ఆస్కార్‌కి నామినేట్ నామినేట్ చేసింది. అయితే ఉత్తమ విదేశీ చిత్రం బరిలో ఆఖరి వరకు మన సినిమా వెళ్లలేకపోయింది. కానీ ఆ రోజుల్లో ఆస్కార్ ఎంట్రీకి అర్హమైన సినిమాగా తెలుగు సినిమా నిలిచింది అంటే.. కె.విశ్వనాథ్ ప్రతిభ ఎలాంటిదో చెప్పొచ్చు.
అప్పటివాళ్లకు ఈ విషయాలన్నీ చర్వితచర్వణం. తెలిసిన విషయాలే మళ్లీ చెబుతున్నారేంటి అనిపించొచ్చు. కానీ ఇప్పటివాళ్లకు నాటి సినిమాలు, విశ్వనాథ్ ఘనతలు చెప్పాలంటే ఇలాంటి విషయాలు చెప్పకతప్పదు. అందుకే మా ఈ ప్రయత్నం.