సినిమా హిట్ టవ్వడం ప్లాపవ్వడం అనేది పూర్తిగా సినిమా దర్శకుడి చేతిలో ఉంటుంది అని చెప్పలేం. ఒక్కోసారి హీరో క్రేజ్ కూడా ఆ పరాజయం పాలవ్వకుండా కాపాడలేదు. గతేడాది విడుదలైన ‘మన్మధుడు2’ చిత్రం పరిస్ధితి కూడా ఇంతే. ‘చి ల సౌ’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రవీంద్రన్ .. తొలి చిత్రంతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు. దీంతో నాగార్జున కెరీర్లో ఆల్ టైం హిట్ అయిన ‘మన్మధుడు’ చిత్రానికి సీక్వెల్ చేసే అవకాశాన్ని నాగార్జున.. దర్శకుడు రాహుల్ చేతిలో పెట్టాడు.
గతేడాది విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కానీ ఎందుకో ఈ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. రివ్యూలు బాగా వచ్చాయి… కానీ ‘మన్మధుడు’ స్థాయిలో మెప్పించలేకపోయింది అని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేదు. దీంతో మంచి చిత్రం పేరు పెట్టి సీక్వెల్ తీసి ఆ సినిమా స్థాయిని తగ్గించాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు దర్శకుడు రాహుల్. ఆ టైములో బాగా కుంగిపోయాడంట. ఆ టైములో నాగార్జున గారు ధైర్యం చెప్పారు అంటూ రాహుల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
‘నువ్వు చేసిన ప్రయత్నం మంచిదే .. కానీ కొన్ని సార్లు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అంతమాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతవరకూ చెయ్యాలో అంతవరకూ చేశావు. ఇక ఫలితాన్ని గురించిన ఆలోచన వదిలేయి’ అంటూ నాకు ధైర్యం చెప్పారు. ఆయన ఇచ్చిన సపోర్టును నేను ఎప్పటికీ మరచిపోను’ అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్.