ఇండస్ట్రీకి ఎవరు ఎలా వచ్చి ఏ విధంగా సెటిల్ అయినా, అవ్వకపోయినా వెండితెర మీద ఒక్కసారి తమ పేరును టైటిల్ కార్డ్స్ లో చూడగానే అప్పటివరకూ పడిన కష్థాన్ని మర్చిపోతారు. ఒక్కోసారి చేసినపనికి తగ్గ రెమ్యూనరేషన్ లభించకపోయినా.. టైటిల్ క్రెడిట్ వస్తే చాల్లే అనుకుంటారు కొందరు. కానీ.. విచిత్రంగా తనకు టైటిల్ కార్డ్ మీద ఇంట్రెస్ట్ లేదు అంటున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అందుకు కారణం లేకపోలేదు.. నిజానికి “థటీజ్ మహాలక్ష్మి” చిత్రానికి తొలుత దర్శకుడు నీలకంఠ. కానీ.. తర్వాత హీరోయిన్ తమన్నాతో వచ్చిన మనస్పర్ధల కారణంగా ఆయన తెలుగు వెర్షన్ నుంచి తప్పుకొని కన్నడ వెర్షన్ కు షిఫ్ట్ అయ్యారు. ఆయన ప్లేస్ లో వచ్చాడు ప్రశాంత్ వర్మ. అప్పటికే దాదాపు 60% షూటింగ్ పూర్తైంది.
కట్ చేస్తే.. మొన్నామధ్య విడుదలైన క్వీన్ రీమేక్ నాలుగు భాషల ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో తెలుగు తప్ప అన్నీ భాషల చిత్రాల డైరెక్టర్ క్రెడిట్స్ కి పేర్లు ఉన్నాయి. దాంతో.. తెలుగు వెర్షన్ డైరెక్టర్ ఎవరు అనే విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ విషయమై ప్రశాంత్ వర్మను ప్రశ్నించగా.. ఆ సినిమా మొత్తాన్ని నేను డైరెక్ట్ చేయలేదు, అందుకే టైటిల్ క్రెడిట్స్ వద్దు అనుకున్నాను. అందుకే నిర్మాతలకు చెప్పి నా పేరు రాకుండా జాగ్రత్తపడ్డాను అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్. మనోడు నెక్స్ట్ రాజశేఖర్ హీరోగా మరో సినిమా డైరెక్ట్ చేయనున్నాడు.