మరణం అనేది సహజం కానీ అది ఆకాలంలో సంభవిస్తే చాలా బాధ కలిగిస్తుంది. మనం అభిమానించే వ్యక్తులు, నటీనటులు ప్రమాదాల వలనో, ఆత్మ హత్యల వలనో ఊపిరి వదిలేస్తే ఆ సంఘటన కలిచి వేస్తుంది. మనతో ఎటువంటి అనుభంధం పరిచయం లేకపోయినా సినీ తారలు చనిపోతే ఆప్తులను కోల్పోయిన భాధను అనుభవిస్తాం. అయ్యో ఇలా ఎందుకు జరిగిందని విలపిస్తాము. ఇటీవల బాలీవుడ్ కి చెందిన ఇర్ఫాన్ ఖాన్ మరియు రిషి కపూర్ అకాల మరణం పొందారు.వీరి అకాల మరణాలకు దేశంలోని అన్నీ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగి అర్థాంతరంగా తనువు చాలించిన అనేక మంది నటీనటలు ఉన్నారు వారిలో కొందరు ప్రముఖులను మనం ఇప్పుడు ప్రస్తావిద్దాము.
సావిత్రి:
చిత్ర పరిశ్రమలో సావిత్రిది ఒక శకం. వెండితెరను ఏలిన నటీమణి. సౌత్ లో మొదటి స్టార్ హీరోయిన్ గా ఆమెను చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ కూడా ఆమె తరువాతే అన్నట్లుగా ఉండేది అప్పట్లో ఆమె స్టార్ డమ్. జెమినీ గణేష్ ని ప్రేమ వివాహం చేసుకున్న సావిత్రి కొన్ని కారణాల వలన ఆయనతో విడిపోయింది. పరిశ్రమలో అనేక మంది ఆమెను ఆర్థిక విషయాలలో మోసం చేశారు. దాన గుణం, మంచి తనం వలన అన్నీ కోల్పోయిన సావిత్రి 19నెలలు కోమాలో గడిపి 26 డిసెంబర్ 1981 లో మరణించారు. అప్పటికి ఆమె వయసు కేవలం 45 సంవత్సరాలు మాత్రమే.
శ్రీదేవి:
దేశం మొత్తం స్టార్ డమ్ సంపాదించిన హీరోయిన్ శ్రీదేవి. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన సావిత్రి స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాను ఓ ఊపు ఊపారు. అందం, అభినయం ఆమె సొంతం కావడంతో స్టార్ హీరోల మొదటి ఛాయిస్ అయ్యారు. 1979లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి 1983లో వచ్చిన ఇమ్మత్ వాలా సినిమాతో బ్రేక్ అందుకొంది. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. నటనపై మక్కువతో వయసుకు దగ్గ పాత్రలు చేస్తున్న శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయిలోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తు బాట్ టబ్ లో పడి ప్రాణాలు విడిచారు.
సౌందర్య:
మోడరన్ కాలంలో సావిత్రి అంతటి స్టార్ డమ్ మరియి నటిగా గుర్తింపు పొందింది హీరోయిన్ సౌందర్య. దాదాపు ఒకటిన్నర దశాబ్దం ఈమె వెండితెపై తిరుగులేని నటిగా గుర్తింపు పొందారు. నటనకు స్కోప్ ఉన్న ఏ పాత్ర అయినా ఆరోజుల్లో సౌందర్య వద్దకు చేరేది. గ్లామర్ పాత్రలకు దూరంగా అన్నేళ్లు వెండితెరపై కొనసాగిన ఏకైన నటి సౌందర్య. నటిగా ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే సౌందర్య బీజేపీ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున ప్రచారంలో భాగంగా విమానంలో వెళుతున్న సౌందర్య అది కూలిపోవడంతో 2004 ఏప్రిల్ 17న బెంగుళూర్ సమీపంలో మరణించారు. అప్పటికి సౌందర్య వయసు కేవలం 32 సంవత్సరాలే.
దివ్య భారతి:
దివ్య భారతి జీవితం ఓ తారా జువ్వలా ముగిసిపోయింది. 15ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దివ్యభారతి అతి తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. వెంకటేష్ హీరోగా 1990లో వచ్చిన బొబ్బిలి రాజా సినిమాతో వెండితెరకు పరిచయమైంది. మైమరిపించే అందం, ఆకట్టుకునే అభినయం ఆమెకు లెక్కకు మించిన అవకాశాలు తెచ్చిపెట్టాయి. టాప్ డైరెక్టర్స్, హీరోలు ఆమె కోసం క్యూ కట్టే పరిస్థితి. కేవలం నాలుగేళ్ళ కెరీర్ 25పైగా సినిమాలు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంతటి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5, 1993లో తను నివసించే అపార్ట్మెంట్ లోని బాల్కనీ నుండి కింద పడి దివ్య భారతి మరణించింది. ఆ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇప్పటికీ మిస్టరీనే. అప్పటికి దివ్యభారతి వయసు కేవలం 19 సంవత్సరాలు.
సిల్క్ స్మిత:
ఏలూరుకి దగ్గరలోని ఓ చిన్న పల్లెటూరికి చెందిన విజయలక్ష్మీ వడ్లపాటి అనే చదువు సంధ్య లేని అమాయకురాలు భర్త వేధింపులు తట్టుకోలేక చెన్నై ట్రైన్ ఎక్కిపారిపోయింది. కట్ చేస్తే రెండు మూడేళ్ళలో సౌత్ ఇండియాలోనే హాట్ ఫేవరేట్ శృంగార తార సిల్క్ స్మితగా మారిపోయింది. వందల సినిమాలలో గ్లామర్ రోల్స్ చేసింది. కైపెక్కించే కళ్ళు, కట్టిపడేసే నృత్యం ఆమె సొంతం. జీవితం సాఫీగా సాగుతున్న రోజులలోనే డిఫ్రెషన్ కి గురైన సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన ఇంటిలో ఆత్మ హత్య చేసుకున్నారు. అప్పటికి సిల్క్ స్మిత వయసు 35సంవత్సరాలు.
ఆర్తి అగర్వాల్:
తక్కువ కాలంలో భారీ ఫేమ్ తెచ్చుకొని అలాగే ఫేడ్ అవుటైన హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ని చెప్పుకోవచ్చు. తెలుగులో ఆమె మొదటి చిత్రం వెంకటేష్ హీరోగా 2001లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్. అది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు దక్కాయి. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్, నాగార్జున, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ అందరి సరసన నటించింది. అదే సమయంలో ఓ యంగ్ హీరో ప్రేమలో పడి సినిమా మరియు శరీరం పై శ్రద్ద వదిలేసింది. దీనితో బాగా బరువు పెరిగింది. చిన్నగా అవకాశాలు తగ్గిపోయాయి, ఈ క్రమంలో కుటుంబంలో గొడవలు, ఇష్టం లేని పెళ్లి, విడాకులు అన్నీ జరిగిపోయాయి. మళ్ళీ హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని బరువు తగ్గడం కోసం ఆమె చేసిన ప్రయత్నం వికటించి ప్రాణాలు విడిచింది. జూన్ 6, 2015లో ఆర్తి అగర్వాల్ మరణించగా అప్పటికి ఆమె వయసు 31 మాత్రమే.
ప్రత్యూష:
అప్పుడప్పుడే పరిశ్రమలో హీరోయిన్ గా ఎదుగుతున్న నటి ప్రత్యూష మరణం ఒక మిస్టరీ. ఆమె చనిపోయే నాటికి తెలుగు మరియు తమిళ భాషలలో సినిమాలు చేస్తుంది. 2003 ఫిబ్రవరి 23న తన ప్రియుడు సిద్దార్ధ్ రెడ్డితో కలిసి సూసైడ్ అట్టెంప్ట్ చేసిందని అందుకే ఆమె మరణించిందని కథనం. ఐతే ఆమెను రేప్ చేసి చంపేశారని ఆమె తల్లి వాదన. కారణం ఏదైనా కేవలం 20ఏళ్ల వయసులో ప్రత్యూష లోకం విడిచి వెళ్ళిపోయింది.
ఫటా ఫట్ జయలక్ష్మీ:
1976లో వచ్చిన డైరెక్టర్ బాలచందర్ ఎపిక్ క్లాసిక్ అంతులేని కథ సినిమాలో అప్పటి వరకు ఏ నటి చేయని బోల్డ్ రోల్ లో నటించింది ఫటా ఫట్ జయలక్ష్మీ. తెలుగులో 1972లో వచ్చిన ఇద్దరు అమ్మాయిలు చిత్రంతో ఈమె వెండితెరకు పరిచయం అయ్యారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే జయలక్ష్మీ మానసిక రుగ్మత కారణంగా ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు.
శ్రీహరి:
నటుడిగా చిత్ర సీమకు పరిచయమై, యాక్షన్ హీరోగా ఎదిగాడు శ్రీహరి. 90లలో శ్రీహరి మోస్ట్ వాంటెడ్ విలన్ గా అనేక చిత్రాలలో నటించారు. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేసిన శ్రీహరి ఆర్ రాజ్ కుమార్ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా అస్వస్థకు గురయ్యారు. అక్టోబర్ 9, 2003లో శ్రీహరి ముంబైలోని లీలావతి హాస్పిటల్ నందు మరణించారు. 49ఏళ్లకే శ్రీహరి కళామతల్లి ఒడిలో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
ఉదయ్ కిరణ్:
హ్యాట్రిక్ విజయాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరో ఉదయ్ కిరణ్. 2000లో తేజా దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే భారీ విజయాలు అందుకున్నాయి. మొదట్లో వచ్చిన సక్సెస్ ఉదయ్ కిరణ్ ని కొంత కాలం తరువాత పలకరించలేదు. బాగా ఉన్నప్పుడు వెంట ఉన్న మిత్రులు, డబ్బు, హోదా, గౌరవం ఇప్పుడు లేవని బాధపడిన ఉదయ్ కిరణ్ 33ఏళ్ల వయసులో 5 జనవరి 2014న ఆత్మ హత్య చేసుకున్నారు.
రఘు వరన్:
విలక్షణ నటుడిగా పేరున్న రఘువరన్ 200 పైగా చిత్రాలలో సౌత్ ఇండియాలోని అన్ని భాషలలో నటించారు. అలాగే హిందీలో కూడా కొన్ని సినిమాలో ఆయన నటించడం జరిగింది. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెలుగొందిన రఘువరన్ కేవలం 49 ఏళ్ల వయసులో 13మార్చ్ 2008 న షుగర్ లెవెల్స్ పడిపోయిన కారణంగా మరణించారు.
వేణు మాధవ్:
స్టార్ కమెడియన్ గా ఏళ్ల తరబడి టాలీవుడ్ ని ఏలిన వేణు మాధవ్ హీరోగా, నిర్మాతగా కూడా రాణించారు. 1996లో కృష్ణ హీరోగా వచ్చిన సాంప్రదాయం సినిమాతో కమెడియన్ గా వెండితెరకు పరిచయమై అంచలంచెలుగా ఎదిగాడు. 2019 సెప్టెంబర్ 25న వేణు మాధవ్ లివర్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా 40ఏళ్ల వయసులో అశువులు బాశారు.
యశో సాగర్:
కరుణాకరన్ దర్శకత్వంలో స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా 2008లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఉల్లాసంగా ఉత్సహంగా చిత్రాన్ని ఎవరూ మర్చిపోరు. ఆ సినిమా హీరో యశో సాగర్ ఆ చిత్రం ద్వారా తెలుగువారికి పరిచయమే. ఐతే ఈ యంగ్ హీరో డిసెంబర్ 25, 2012లో ఓ కారు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.
విజయ్ సాయి:
అమ్మాయిలు అమ్మాయిలు అనే ఓ కామెడీ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ అనేక సినిమాలలో కామెడీ రోల్స్ చేశారు. 2011 డిసెంబరు తన భార్య వేధింపుల కారణంగానే తను సూసైడ్ చేసుకుంటున్నట్లు చెప్పి మరి ఆయన ఆత్మ హత్య చేసుకున్నారు.
కునాల్ సింగ్:
ప్రేమికుల రోజు సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడైన కునాల్ సింగ్ అనేక హిందీ మరియు తమిళ్ ఫిలిమ్స్ నటించారు. ఆయన ఫిబ్రవరి 7, 2008లో ముంబైలోని తన అపార్ట్మెంట్ లో ఉరివేసుకొని ప్రాణాలు వదిలాడు. ఈ కేసు అనేక మలుపు తిరిగిన అనంతరం సూసైడ్ గానే నిర్ధారించి మూసివేశారు. అప్పటికి కునాల్ వయసు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే.
అచ్యుత్:
90లలో హీరోగా ఎదగడానికి తీవ్ర ప్రయత్నం చేసిన అచ్యుత్ ఆ తరువాత అనేక పాత్రలు చేశారు. అచ్యుత్ దూరదర్శన్ లో ప్రసారమైన కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. 26 డిసెంబర్ 2012న అచ్యుత్ గుండె పోటు కారణంగా మరణించాడు. అప్పటికి అచ్యుత్ వయసు 41ఏళ్ళు.
మోనాల్:
సిమ్రన్ చెల్లి మోనాల్ అతి తక్కువ వయసులో ప్రేమ విఫలం కావడంతో ఏప్రిల్ 14, 2002లో ఉరి వేసుకొని ప్రాణాలు వదిలారు. కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ కారణంగానే తన చెల్లి ఆత్మ హత్య చేసుకున్నట్లు సిమ్రాన్ ఆరోపించారు. మోనాల్ కేవలం 20ఏళ్లకే ఆత్మ హత్య చేసుకొని ప్రాణాలు విడిచారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్
బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఉరి వేసుకోవడం వల్ల ఊపిరాడక సుశాంత్ మృతి చెందారని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది. గత ఆరు నెలలుగా సుశాంత్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. సుశాంత్ శనివారం రాత్రి ఆలస్యంగా నిద్రపోయారు. ఉదయాన్నే జ్యూస్ తాగి, మళ్లీ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని ఇంట్లో పనిచేసే వ్యక్తులు పోలీసులకు తెలిపారు. ఎంతసేపటికీ సుశాంత్ బయటకు రాకపోవడంతో అతడి స్నేహితులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు తలుపు పగలగొట్టి చూడగా, బెడ్ షీట్ సాయంతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని సుశాంత్ కనిపించారు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు, 108కి కాల్ చేసి చెప్పారు. అప్పటికే సుశాంత్ మృతిచెందారు. ఆయన గదిలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు. సుశాంత్ మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.