చిరంజీవి సినిమా అంటే… ఏ కష్టం లేకుండా రిలీజ్ చేసేయొచ్చు అని అంటుంటారు. గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతూ వచ్చింది. అయితే ‘గాడ్‌ఫాదర్’ సినిమా విషయంలో ఇదంతా జరగడం లేదా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కావాలనే చేస్తున్నదే, అనుకోకుండా ఇలా జరుగుతోందా అనేది తెలియదు కానీ.. ‘గాడ్‌ఫాదర్’ విడుదల విషయంలో నైజాం ఏరియాలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని అంటున్నారు. దీంతో చిరంజీవి సినిమాకు ఇలాంటి పరిస్థితా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
చిరంజీవి సినిమాకు ప్రత్యేకం హైప్ అక్కర్లేదు, బజ్ క్రియేట్ అవ్వక్కర్లేదు, క్రేజ్ కొత్తగా రానక్కర్లేదు అంటుంటారు. కానీ ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి సినిమాకు కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది అంటున్నారు. ‘గాడ్‌ఫాదర్’ కోసం నైజాంలో థియేటర్ల కోసం ఇంకా వెతుకులాట కొనసాగుతోందని వార్తలొస్తున్నాయి. అక్టోబరు 5న నాగార్జున ‘ఘోస్ట్’ సినిమా రిలీజ్ కానుండటం, అంతకుముందు వారం విడుదల కానున్న ‘పొన్నియిన్ సెల్వన్ 1’కు కొన్ని థియేటర్లలో ఉండే అవకాశం ఉండటంతో చిరు సినిమాకు థియేటర్ల సమస్య వస్తోంది అని అంటున్నారు.
‘ఘోస్ట్’ సినిమాను ఏషియన్ సినిమాస్ నిర్మించిన విషయం తెలిసిందే. వారికి నైజాం ఏరియాలో చాలా థియేటర్లు ఉన్నాయి. కాబట్టి ఆ సినిమాకు థియేటర్ల విషయంలో పెద్ద ఇబ్బందేం లేదు అని చెప్పొచ్చు. ఇక ‘పొన్నియిన్ సెల్వన్ 1’ను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ సినిమాకు ఎక్కువ థియేటర్లే వస్తాయి. దీంతో ‘గాడ్‌ఫాదర్’కి సరైన థియేటర్లు దొరకడం లేదు అనే టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంలో రామ్‌చరణ్ తేజ్ కలగజేసుకున్నాడని.. దీంతో తేలిపోతుందని అంచనా వేస్తున్నారు.
విషయాన్ని ఎలాగోలా ఫిక్స్ చేసేసుకుంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే చిరంజీవి సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అనేదే ప్రశ్నగా మారిపోయింది. చిరంజీవి సినిమాకే థియేటర్ల విషయంలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారు. చిన్న సినిమాల సంగతి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.