టాలీవుడ్‌లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన ప్రేమ కథా చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.సి. ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి.రాజు నిర్మించిన ఈ చిత్రం 1998 జూలైలో విడుదలై ఘన విజయం సాధించింది. ఓ మధ్య తరగతి యువకుడి తొలిప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతను కట్టిపడేసింది. ప్రేమ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు, దేవా స్వరపరిచిన పాటలు ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి.
ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే అతికొద్ది సినిమాల్లో ఒకటిగా ‘తొలిప్రేమ’ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ వెండితెరపై ప్రదర్శించబోతున్నారు. సినిమా విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4k వెర్షన్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు. శ్రీ మాతా క్రియేషన్స్ విడుదల చేస్తున్న ఈ చిత్రం జూన్ 30న 300కి పైగా థియేటర్లలో భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రీ-రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి.. ఆ సినిమాకి పనిచేసి.. ఆ తర్వాత దంపతులుగా మారిన ఆనంద సాయి, వాసుకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘తొలిప్రేమ’ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేసిన ఆనంద సాయి మాట్లాడుతూ.. సినిమాతోనే నా ప్రయాణం మొదలైంది. అప్పటికి నాకు ఆర్ట్ డైరెక్షన్ గురించి పెద్దగా తెలీదు. కానీ నువ్వు చేయగలవని కళ్యాణ్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు.
ఆరోజు కళ్యాణ్ గారు ఆ ఫ్లాట్ ఫామ్ ఇవ్వడం వల్లే, ఈరోజు నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను. కళ్యాణ్ గారు లేకపోతే నేను గానీ, కరుణాకరన్ గానీ ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. ముందుగా వేరే పెద్ద ఆర్ట్ డైరెక్టర్‌ని అనుకున్నప్పటికీ, నాకు ఈ అవకాశమిచ్చి కరుణాకరన్‌గారు, జి.వి.జి.రాజుగారు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు. తొలిప్రేమ అనేది జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమా’’ అన్నారు.
సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా నటించిన నటి వాసుకి మాట్లాడుతూ.. (Tholiprema) తొలిప్రేమ విడుదలైన సమయంలో నేను ఇక్కడ లేను, చెన్నైలో ఉన్నాను. కానీ ఇప్పుడు రీ రిలీజ్ సమయంలో ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా అరుదైన అవకాశం. ఈ సినిమా రీరిలీజ్ అవుతుండటం, నేను హైదరాబాద్‌లోనే ఉండటం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.