అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ అజ్ఞాతం వీడి ప్రజల్లోకి వచ్చారు. ఇక నుంచి జనసేన పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం చేయడానికి పలు యాత్రలు చేపట్టనున్నారు. తొలిసారిగా చలోరే చలోరే చల్ యాత్రని ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు పవన్ ప్రారంభించిన ఈ యాత్రతో అభిమానులు చాలా సంతోషంగా ఉంటే రాజకీయనాయకులు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పవన్ యాత్రను అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. ఇప్పుడు కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కూడా పవన్ యాత్ర విషయంలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించారు.
సకలజనుల సమ్మె జరిగిన సమయంలో పవన్‌ను టూరిస్ట్ అని కామెంట్ చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు పవన్‌కు తెలంగాణలో పర్యటించేందుకు వీసా ఎలా జారీ చేశారని ఆమె ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ వంటి టూరిస్ట్ నేతకు స్వేచ్ఛ కల్పించిన ప్రభుత్వం.. ఉద్యమ నేతలకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ కోసం పోరాడిన జేఏసీ నేతలకు కూడా పవన్ మాదిరిగా వీసాలిస్తే వారికి కనీసం.. తెలంగాణలో ఉన్నామన్న భావన కలుగుతుందని ముఖ్యమంత్రికి సూచించారు. అయితే పవన్ కళ్యాణ్ యాత్రపై తప్ప, అతనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి విమర్శలను విజయశాంతి చేయకపోవడం విశేషం.