‘విరాటపర్వం’… ఈ సినిమా పేరు చెబితే మొన్నీ మధ్య వరకు టాలీవుడ్‌లో రానా – సాయిపల్లవి – వేణు ఉడుగుల పేర్లు వినిపించేవి. అయితే ఇటీవల చిత్రబృందం వరంగల్ – భూపాలపల్లి వెళ్లి ఓ మహిళ కుటుంబాన్ని కలిశారు. దీంతో సినిమా ప్రచారంలో ఆ ప్రాంతం పేరు, ఆ మహిళ పేరు ఎక్కువగా వినిపించడం మొదలైంది. సినిమాను ఫాలో అవుతున్న వాళ్లకైతే ఆమె ఎవరో తెలిసిపోతుంది. లేనివాళ్ల కోసం అయితే ఆమె పేరు సరళ. ‘విరాటపర్వం’లో వెన్నెల పాత్రకు ఆ సరళనే స్ఫూర్తి. ఇంతకీ ఎవరామె.
సరళ తల్లిదండ్రులు స్వరాజ్యం, భిక్షమయ్య. తండ్రి వామపక్ష విప్లవభావాలు కలిగిన వ్యక్తి, సీపీఐ ఆర్గనైజర్‌గా వ్యవహరించారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన కుటుంబం వారిది. నాలుగో సంతానంగా జన్మించిన సరళ అంటే అందరికీ గారాబం. ఆ ప్రాంతమంతా వామపక్ష ప్రభావం ఉండడంతో పిల్లల చదువుల కోసం 1985లో వీరి కుటుంబం ఖమ్మం వెళ్లిపోయింది. అయితే సరళ పైకి చెప్పకున్నా.. ఎలాగైనా ఉద్యమంలోకి వెళ్లి పోరాడాలని నిర్ణయించుకున్నారట. దీంతో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేయగానే… ఇంట్లో చెప్పకుండానే అడవిబాట పట్టారట.
అప్పటికే పీపుల్స్ వార్‌లో పనిచేస్తున్న శంకరన్నను వెతుక్కుంటూ ఖమ్మం నుండి నిజామాబాద్ అడవుల్లోకి వెళ్లారట సరళ. అయితే అక్కడ సరళను పోలీస్ ఇన్‌ఫార్మర్ అనుకొని ఉద్యమకారులు చంపేశారట. సరళ ఇంట్లో నుంచి వెళ్లాక సుమారు 35 రోజుల తర్వాత ఆమె చనిపోయిందని పీపుల్స్‌వార్ ఓ లేఖ విడుదల చేసిందట. దీంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారట సరళ సోదరుడు వరంగల్‌లోని ప్రశాంతి ఆసుపత్రి ఛైర్మన్ తూము మోహన్‌రావును దర్శకుడు వేణు కొన్ని నెలల కిందట కలిశారట.
‘విరాటపర్వం’ సినిమాకు సరళ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పారట. సరళ గురించి దర్శకుడు వేణు పరిశోధనలు చేసి అనేక విషయాలు తెలుసుకున్నారట. అడవిలోకి వెళ్లాక సరళ ఎదుర్కొన్న ఇబ్బందులు, పడ్డ కష్టాలు, సవాళ్లను పరిశీలించి చిత్రాన్ని రూపొందించారట. సినిమా తీయడంలో దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఉండాలన్నదే తమ అభిప్రాయమని, అందుకే ముందే సినిమా చూసి మార్పు చేర్పులు చెప్పలేదని మోహన్‌రావు తెలిపారు.