హీరోయిన్లు ప్రమోట్ చేయని సినిమాలు చూసి ఉంటాం లేదా నిర్మాతలు మారిన చిత్రాలను చూసి ఉంటాం. ఈమధ్యకాలంలో హీరోలు ప్రమోట్ చేయకుండా వదిలేస్తున్న సినిమాలు మాత్రం ఇబ్బడిముబ్బడిగా విడుదలైపోతున్నాయి. “అర్జున్ రెడ్డి” తర్వాత సూపర్ ఫామ్ లో విజయ్ దేవరకొండ ఎప్పుడో అయిదేళ్ళ క్రితం నటించిన “ఏ మంత్రం వేసావే” చిత్రాన్ని కేవలం అతడి క్రేజ్ ను క్యాష్ చేసుకోవడం కోసం ఒక నాలుగు నెలల క్రితం విడుదల చేశారు. విజయ్ దేవరకొండ ఆ సినిమా ప్రమోషన్స్ ను కనీసం పట్టించుకోలేదు సరిగా “అది నా బ్యాక్ లాగ్” అని ట్విట్టర్ ద్వారా ప్రకటించడం విశేషం.
ఇదే తరహాలో ఇటీవల శౌర్య తాను నటించిన “కణం”, మంచు విష్ణు “ఆచారి అమెరికా యాత్ర” చిత్రాల ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నారు. నిన్న విడుదలైన ఈ రెండు సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి అది వేరే విషయం అనుకోండి. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ కి హీరోలు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. శౌర్య అంటే తనకు సాయిపల్లవితో పడడం లేదు అని పబ్లిక్ గా చెప్పేశాడు కాబట్టి రాకపోయినా ఒక అర్ధం ఉంది. కానీ.. విష్ణు ఎందుకు రాలేదు. సినిమా రిజల్ట్ ముందుగానే ఊహించి లేదా ఎక్స్ పెక్ట్ చేసి ప్రమోషన్స్ నుంచి తప్పించుకొన్నాడా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒక సినిమా ఒప్పుకున్నాక ఆ సినిమా హిట్టా, ఫ్లాపా అనే విషయం పక్కన పెట్టేస్తే సదరు సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత సినిమాలోని అందరి ఆర్టిస్టులకంటే.. సదరు సినిమా హీరో మీద ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని భవిష్యత్ తరాల కథానాయకులు పాటిస్తేనే మంచిది. లేదంటే.. సినిమా ఔట్ పుట్ చూసుకొన్న ప్రతి కథానాయకుడు ప్రమోషన్స్ కి రావడం మానేస్తాడు.