బిగ్‌బాస్ అంటేనే ఎంటర్‌టైన్మెంట్. వారం మొత్తం ఇంట్లో ఉన్నవారిని చూసి చూసి మొహం మొత్తేసిన ప్రేక్షకులు వీకెండ్ గెస్టులు ఎవరా అని ఎదురు చూస్తుంటారు. కొంతమందైతే వీకెండ్ గెస్టుల కోసం బిగ్‌బాస్ చూస్తుంటారు. అయితే ఈ సీజన్‌లో అలాంటి వారి ఆశలు అడియాసలైనట్లే. ఎందుకంటారా… కరోనా వైరస్ కారణంగా ఈ సారి బిగ్‌బాస్ ఇంట్లోకి గెస్టుల వచ్చే అవకాశం లేదు. కంటెస్టెంట్ల విషయంలో బిగ్‌బాస్ ఏం చేసిందో మనందరికీ తెలిసిందే.
వాళ్లను 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేసి ఆ తర్వాత కరోనా లేదని నిర్ధరించుకుని ఇంట్లోకి పంపించింది. అలాంటప్పుడు ఇంట్లోకి వెళ్లాల్సిన గెస్టుల విషయంలోనూ ఇదే పని చేస్తారుగా. ఆఁ! అదే ఇప్పడు బిగ్‌బాస్‌లో స్టార్లు, గెస్టుల రాకకు అడ్డుతగిలేలా ఉంది. తమ సినిమా ప్రచారం కోసం షోకు వచ్చేవారు… క్వారంటైన్‌లో ఉండి, పరీక్షలు చేయించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్లు బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లరు. వీడియో కాల్స్ రూపంలో, జూమ్ ఇంటర్వ్యూల రూపంలో ఏమన్నా వస్తే రావాలి.
అయినా అది ప్రేక్షకులకు కిక్ ఇవ్వదు. మరోవైపు తెలుగు పరిశ్రమలో సినిమాల చిత్రీకరణ మొదలైనా.. సినిమాల విడుదల ఎప్పుడు అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఈ లెక్కన ఆలోచించినా… సినిమాలు రావు కాబట్టి స్టార్ ఎంట్రీలు ఉండవు. ఇది ఈ సారి షో మజాను కాస్త తగ్గించేదే మరి. వీటికి చెక్ పెట్టడానికి బిగ్‌బాస్ టీమ్ ఏం ఆలోచిస్తుందో చూడాలి.