ఇండియన్ సినిమా చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. 78 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇంకా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎన్నో కోట్లకు అధిపతి ఆయన ఒకానొక సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో రూ.90 కోట్ల అప్పు పేరుకుపోయింది. డబ్బు అప్పుగా ఇచ్చినప్పుడు ఎంతో మర్యాదగా ప్రవర్తించిన వ్యక్తులు.. ఆ తరువాత ఎంతో దారుణంగా మాట్లాడేవారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అమితాబ్.
44 ఏళ్ల తన సినీ కెరీర్ లో 1999 కాలం చీకటి రోజులని.. ఆ సమయంలో తను స్థాపించిన వెంచర్ దారుణంగా ఫెయిల్ అయిందని.. దీంతో తొంబై కోట్ల అప్పు మిగిలిందని అన్నారు. ఆ సమయంలో అప్పుల వాళ్ల ఇబ్బందులు ఎక్కువయ్యాయని.. వారు తన ఇంటి దగ్గరకు వచ్చి నీచంగా మాట్లాడేవారని.. కొందరు బెదిరింపులకు కూడా పాల్పడినట్లు చెప్పుకొచ్చారు. అసలు ఆ సమస్య నుండి బయటపడతాననే నమ్మకం కూడా లేదని అన్నారు.
ఎలాగైనా అప్పులన్నీ తీర్చాలని నిర్ణయించుకొని.. ఒకదాని తరువాత ఒకటి చొప్పున అప్పు తీరుస్తూ వచ్చినట్లు తెలిపారు. దూరదర్శన్ కు బాకీ పడ్డ మొత్తాన్ని కూడా చెల్లించినట్లు చెప్పారు. వడ్డీ చెల్లింపుల కోసం ఆ ఛానెల్ లో కొన్ని ప్రకటనల్లో కూడా కనిపించానని.. అయితే అప్పు ఇచ్చిన వారు తనతో ప్రవర్తించిన పద్దతిని ఎప్పటికీ మర్చిపోలేనని.. అసభ్య పదజాలంతో దూషించారని అప్పటిరోజులు గుర్తు చేసుకున్నారు.