రాంగోపాల్ వర్మ నిర్మాణ సారధ్యంలో రూపొందిన తాజా చిత్రం “భైరవ గీత”. ఆయన ప్రియ శిష్యుడు సిద్ధార్ధ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కి.. ఒకేరోజున విడుదల చేసేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ కారణాంతరాల వలన కుదరలేదు. అయితే.. ఈ చిత్రాన్ని కన్నడలో గతవారమే విడుదల చేసిన వర్మ.. తెలుగులో మాత్రం ఒకవారం లేటుగా ఇవాళ (డిసెంబర్ 14) విడుదల చేశాడు. మరి ఈ వర్మ మార్క్ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి..!!
కథ : ఆధునిక కాలంలోనూ ఇంకా కులాన్ని బట్టి మనిషి స్థాయిని శాసించే ఓ గ్రామానికి చెందిన భైరవ (ధనుంజయ్) ఆ ఉరిపెద్ద సుబ్బారెడ్డి ఒక్కగానొక్క కూతురైన గీతా (ఇర్రామోర్)ను ప్రేమిస్తాడు. కానీ.. తాను బానిస కులానికి చెందినవాడిననే కారణంతో తన ప్రేమను ఆమెకు వ్యక్తపరచడు. అదే క్రమంలో భైరవపై ప్రేమను పెంచుకుంటుంది గీత.
అయితే.. తనను కోడి పందెంలో ఓడించిన కేశవరెడ్డి కొడుకు కట్టారెడ్డి (విజయ్ రామ్)తో తన కుమార్తెకు పెళ్లి కుదుర్చుతాడు సుబ్బారెడ్డి. కేశవరెడ్డి కానీ ఆ పెళ్లి కానీ ఏమాత్రం ఇష్టం లేని గీత, తాను ప్రేమిస్తున్న భైరవతో లేచిపోతుంది. ఒక కూతురు లేచిపోయింది అనే బాధ కంటే తమ కులానికి సరితూగని వాడు, బానిస అయిన భైరవతో తన కూతురు వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన సుబ్బారెడ్డి.. భైరవతోపాటు గీతను కూడా చంపేయమని తన అనుచర బానిసలను ఆదేశిస్తాడు. ఇక అప్పడు మొదలైన భైరవ వర్సెస్ రెడ్డిల యుద్ధమే “భైరవగీత” కథాంశం.
నటీనటుల పనితీరు : బహుశా కథ, కథనంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క నటుడు అద్భుతమైన నటన కనబరిచిన చిత్రమిదే అనుకుంటా. హీరో ధనుంజయ్ మొదలుకొని సెకండాఫ్ లో వచ్చే తాత పాత్రధారి వరకూ అందరూ తాము పోషించిన పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా.. ప్రతి నటుడి కళ్ళలో కనిపించే కసి, ఇంటెన్సిటీ ప్రేక్షకుడ్ని ఆశ్చర్యపరచడమే కాదు సినిమాలో లీనం చేసే ప్రయత్నం కూడా చేస్తుంది.
హీరోయిన్ ఇర్రా మోర్ నటన అంతంతమాత్రంగానే ఉన్నా.. అందాల ఆరబోతతో మాత్రం కొన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
సాంకేతికవర్గం పనితీరు : కాస్ట్యూమ్స్ & ఆర్ట్ వర్క్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకార్షణగా నిలుస్తాయి. ఆ రెండు సాంకేతిక విభాగాలు తమ 100% ఎఫర్ట్ ను పెట్టాయి ఈ చిత్రంలో. నటీనటుల కాస్ట్యూమ్స్ సినిమాకి పక్కా ఊరి ఫీల్ ను తీసుకురాగా.. ఆర్ట్ వర్క్ ఆ గ్రట్ ఫీల్ ను తీసుకొచ్చింది. రవిశంకర్ బాణీలు గొప్పగా లేవు, నేపధ్య సంగీతానిది కూడా అదే పరిస్థితి. జగదీష్ చీకటి కెమెరా వర్క్ బాగుంది కానీ.. ఆ డ్రోన్ షాట్స్ క్వాలిటీ మాత్రం అస్సలు బాగోలేదు. గింబల్ షాట్స్ ను చాలా ప్లాన్డ్ గా యూటిలైజ్ చేసుకున్నాడు కెమెరామెన్.
దర్శకుడు సిద్ధార్ధ్ వర్మకు ఎందుకని ఆంత ప్రియ శిష్యుడో ఆ ఫ్రేమింగ్స్ చూస్తేనే అర్ధమైపోతుంది. కొన్ని సన్నివేశాలు, బ్లాక్స్ చూస్తుంటే వర్మ డైరెక్ట్ చేశాడేమో అనిపిస్తుంది. ఆర్టిస్టుల నుంచి అద్భుతమైన నటన రాబట్టుకోవడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ అయిన సిద్ధార్ధ్ ఆ నటీనటుల పెర్ఫార్మెన్స్ ను సరైన కథకు యూటిలైజ్ చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. కథ-కథనంలో నవ్యత కనిపించకపోగా.. రా నెస్, వైల్డ్ నెస్ కోసమని రక్తాన్ని బిందెలు బిందెల కొద్దీ వాడిన విధానం, ఆ మొరటు రొమాన్స్ చాలా తక్కువమందికి మాత్రమే నచ్చుతుంది. సున్నిత మానస్కులు ఈ సినిమాకి కాస్త దూరంగా ఉండడం బెటర్. సిద్ధార్ధ్ ఒక దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్నాడు కానీ.. కథకుడిగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. వర్మ దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ను బాగా గెయిన్ చేసిన సిద్ధార్థ్.. కథకుడిగా మాత్రం తన సొంత తెలివి వాడుకోకపోతే దర్శకుడిగా ఎదగడం కాదు కదా కనీసం గుర్తింపు తెచ్చుకోవడం కూడా కష్టమే.
విశ్లేషణ : ఈ కులాలు, వర్గబేధాల నేపధ్యంలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఇప్పుడు “భైరవగీత” కొత్తగా చెప్పింది ఏమీ లేదు. పైగా.. ఆ వయొలెన్స్ & రొమాన్స్ ను సగటు ప్రేక్షకులందరూ ఎంజాయ్ కూడా చేయలేరు. సో, ధారలుగా పొంగే రక్తాన్ని, రోత రొమాన్స్ ను ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రమే “భైరవగీత” చిత్రాన్ని చూసే సాహసం చేయండి.
రేటింగ్ : 1/5