తమిళనాడులో సినిమా ఇండస్ట్రీ వారు వేరే భాషల సినిమాలకు అవకాశం ఇవ్వడం చాలా క్లిష్టమైందని కొంతకాలంగా సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళలో మాత్రం తమిళ చిత్రాలు విస్తృతంగా విడుదలవుతుంటే, అదే ఇతర భాషా చిత్రాలకు తమిళనాడులో థియేటర్ల లభ్యత ఇబ్బందికరంగా మారుతోంది. ప్రత్యేకించి ఏకకాలంలో పెద్ద సినిమాలు లేకపోయినా కూడా కొన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు అక్కడ కావాల్సిన థియేటర్లు దొరుకుతున్నాయా అన్నది ప్రశ్నగా మారింది.
Suriya
ఇటీవల ‘దేవర’ (Devara) చిత్రానికి తమిళనాడులో పరిమిత సంఖ్యలోనే స్క్రీన్లు దొరికాయి. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదలైన ‘అమరన్’ (Amaran) చిత్రం మరింత ఎక్కువ స్క్రీన్ కౌంట్ అందుకోవడం విశేషం. ఇక ‘క’ (KA) చిత్రం తమిళ వెర్షన్ విడుదలకు కూడా పలు అవాంతరాలు ఎదురైనట్లు సమాచారం. చెన్నైలో స్థిరపడ్డ తెలుగు ప్రేక్షకులు ఆసక్తి ఉన్నప్పటికీ, ఆ చిత్రానికి తగినంత స్క్రీన్స్ దొరక్కపోవడంతో అందరూ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంపై తాజాగా కోలీవుడ్ స్టార్ సూర్యకు (Suriya) ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ‘కంగువ’ (Kanguva) ప్రమోషన్‌లో భాగంగా బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో ఓ విలేకరి తమిళనాడులోని ఈ వైఖరిని ప్రశ్నిస్తూ.. “కన్నడ సినిమాలకు మీ రాష్ట్రంలో సరిపడా స్క్రీన్స్ ఇవ్వగలరా?” అని ప్రశ్నించాడు. దీనికి సూర్య తన పద్ధతిలో స్పందిస్తూ.. తాను వ్యాపారంలో లేనని, ఇది పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారమని తెలిపాడు. అయితే ఈ సమస్యను పరిష్కరించడంలో ఎవరు ముందుకు వస్తే, వారికి తాను పూర్తి మద్దతుగా ఉంటానని సూర్య స్పష్టం చేశాడు.
సూర్య మాటలు వినగానే తాము ఆశిస్తున్న మార్పుకు దారి తీస్తుందేమోనని సినీ పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ, ఈ సమస్య మీద చర్చించి పరిష్కారం కోరుకునే విషయంలో తమిళనాడు సినీ ఇండస్ట్రీలో ఎవరు ముందడుగు వేస్తారు అన్నదే అసలు ప్రశ్నగా మారింది. తమిళనాడులో ఇతర భాషా చిత్రాలకు తగినంత స్క్రీన్లు లభిస్తే, భారతీయ సినిమా రంగం మరింత విస్తృతం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.