“మీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే పడుకోవాలంట కదా?, ఇండస్తీలోకి ఒక అమ్మాయి హీరోయిన్ అవ్వాలని రావాలంటే ప్రొడ్యూసర్ లేదా హీరో దగ్గర పడుకోవడమే ఎంట్రన్స్ టెస్ట్ అంట కదా?” శ్రీరెడ్డి, మాధవీలత, గాయత్రి గుప్తా, అర్చన వంటి సినిమా హీరోయిన్స్/ఆర్టిస్ట్స్ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న సమస్యలను యూట్యూబ్, న్యూస్ చానల్స్ ద్వారా బాధలు వెళ్లగక్కుకున్న తర్వాత ఇండస్ట్రీ గురించి సామాన్య ప్రజల్లో కలిగిన భావమిది. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ చిత్రసీమలో “క్యాస్టింగ్ కౌచ్” అనేది రాజ్యమేలుతున్నదని అర్ధమైపోయింది. అయితే.. ఇంత గోల జరిగిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కొందరు “మహా అయితే ఒకరిద్దరికి జరిగి ఉంటుంది, అయినా ఆడదానికి ఇష్టం లేకుండా ఎవడూ ఏమీ చేయలేడు కదా, రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు” అంటూ కామెంట్ చేసినవారు కూడా లేకపోలేదు.
అలా కామెంట్ చేసినవాళ్లందరి నోళ్ళు మూయించడానికి మహిళా ఆర్టిస్టులందరూ నడుం బిగించారు. నిన్నమొన్నటివరకూ తమకు ఎవరి అండా లేక మిన్నకుండిపోయిన వాళ్ళందరూ మహిళా సంఘాలు, కొందరు సోషల్ యాక్టివిస్ట్స్ సపోర్ట్ తో ధైర్యంగా ముందడుగు వేశారు. పదుల సంఖ్యలో మహిళా జూనియర్ ఆర్టిస్టులు, ఆర్టిస్టులు, సినిమాల్లో అవకాశాలు రాక విసిగి వేశారిపోయి సీరియల్స్ లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ నెట్టుకొస్తున్న మహిళలందరూ మీడియా ముందుకు మాత్రమే కాదు జనాల్లోకి వచ్చారు. ఆదివారం మద్యాహ్నం సోమాజీగూడా లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో కొందరు మహిళలు చెప్పిన గాధలు వింటే కళ్ళు చెమర్చకుండా ఉండవు. మనుషులు వేరవ్వచ్చు, సమస్యలు వేరవ్వచ్చు, సందర్భాలు వేరవ్వచ్చు. కానీ.. అందరి కష్టం ఒక్కటే “క్యాస్టింగ్ కౌచ్”. అవకాశాలు ఇస్తామని వాడుకొనేవారు కొందరు, బెదిరించి సుఖాన్ని అడుక్కోనేవారు కొందరు. అలాంటి బాధలు ఎన్నో, వ్యధలు ఎన్నో. వాటికి పరిష్కారం అనేది లేదు, రాదు కూడా. అయితే.. ఈ సమస్యలను అందరూ ఫేస్ చేయకుండా, ఒకవేళ ఫేస్ చేసినా సమస్యలు అరికట్టేందుకు తగిన విధానాలు అమలులోకి వస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ “క్యాస్టింగ్ కౌచ్”లో మరో కోణం కూడా ఉంది. ఈ రొచ్చులో స్టార్ హీరోలు, బడా ప్రొడ్యూసర్లు ఎవ్వరూ లేరు. ఉన్నదల్లా కేవలం కొందరు కో-ఆర్డినేటర్లు, మేనేజర్లు, అసిస్టెంట్ డైరెక్టర్స్ మాత్రమే. హీరోలకి పరిచయం చేస్తామని కొందరు, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని ఇంకొందరు అమ్మాయిల్ని వాడుకొంటున్నారు. ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిల్ని మాత్రమే కాదు ఆన్ లైన్ లో కాస్త అందంగా కనిపించిన అమ్మాయిల్ని కూడా అవకాశాలు ఇస్తామని ఆశజూపి తమ వలలో పడేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో, ఇక్కడ సమస్య ఇండస్ట్రీ కాదు, మగాడి మైండ్ సెట్. అమ్మాయిని ఆటబొమ్మలా చూసే విధానం మారనంతవరకూ ఈ పోకడ పోదు.