‘వార్ 2’ సినిమా ప్రచారం కోసం తారక్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజీన్స్‌కి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అలా ఎస్క్వైర్ ఇంగియా అనే మ్యాగజీన్‌కి కూడా ఇచ్చాడు. అంతేకాదు ఆ పుస్తకరం కవర్ పేజీ కూడా అయ్యాడు. ఈ క్రమంలో ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అందులో భాగంగా ఆయన ‘వార్ 2’ సినిమా గురించి, సినిమా హిట్ ఫార్ములా గురించి మాట్లాడిన అంశాలు కూడా తెలిశాయి.
‘వార్ 2’తో త్వరలో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు ఎన్టీఆర్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ‘వార్ 2’ సినిమా రూపొందింది. కియారా అద్వాణీ కథానాయిక. ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్‌ను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. తారక్ సినిమాలను ఇటీవల రిలీజ్ చేస్తున్న సితార నాగవంశీనే ఈ సినిమాను కూడా రిలీజ్‌చేస్తున్నారు. హృతిక్ రోషన్‌తో తారక్ నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘వార్2’ కోసం భాషతో సంబంధం లేకుండా అందరూ కలిసి పని చేశారని, ఉత్తరాది, దక్షిణాది టెక్నీషియన్స్ దీని కోసం వర్క్ చేశారని తారక్ అన్నాడు. బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అనేవి లేవని మనమంతా ఒక్కటే ఇండస్ట్రీ అని.. అందుకు తగ్గట్టుగా భారతీయ చిత్ర పరిశ్రమగా సినిమా పరిశ్రమను గుర్తించాలి అని తారక్ సూచించాడు. ఇక ‘వార్ 2’ సినిమాను ఎంచుకోవడానికి ప్రధాన కారణం స్క్రిప్టే అని చెప్పాడు. బలమైన కథతో ఈ సినిమా రూపొందిందని. హృతిక్‌తో కలసి పనిచేయడం ఆనందంగా ఉందని కూడా తారక్ తెలిపాడు.
ఇక సినిమాల హిట్ ఫార్ములా గురించి తారక్ మాట్లాడుతూ.. ఇలా తీస్తేనే సినిమాలు హిట్ అవుతాయి అని ప్రత్యేకమైన ఫార్ములా ఏదీ ఉండదు. ఇదే విషయాన్ని గతంలో రాజమౌళి కూడా చెప్పారని తారక్ గుర్తు చేశాడు. ఎంచుకున్న కథను ప్రేక్షకులకు నచ్చేలా చూపించడం మాత్రమే హిట్ ఫార్ములా అని అన్నాడు.