ఎందరో మహానుభావులు.. ఎన్నెన్నో ప్రయత్నాలు.. కానీ మన కల మాత్రం తీరలేదు. కానీ ఒకాయన మాత్రం ఆ పని చేసిపెట్టారు. చిరకాల కోరిక, ఇక కోరికగానే మిగిలిపోతుందా అనుకుంటున్న సమయంలో ‘నేనున్నా.. నేను తీసుకొస్తా..’ అంటూ ముందుకొచ్చారు ఓ దర్శకుడు. అందులో కీలక పాత్ర పోషించారు ఓ సంగీత దర్శకుడు. ఆ కల ఆస్కార్ అయితే.. ఆ దర్శకుడు రాజమౌళి, ఇక ఆ కీలక పాత్ర కీరవాణి. ఇక అవార్డు సినిమా ‘ఆర్‌ఆర్ఆర్’.
అయితే, ఇప్పుడు మనం చూస్తున్న అవార్డు, మాట్లాడుకుంటున్న మాటలు.. ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం సుమారు నాలుగేళ్ల క్రితం కీరవాణి ఓ మాట అని.. తర్వాత వెనక్కి తీసుకోవడమే అని చెప్పొచ్చు. అవును 2014 సమయంలో కీరవాణి తన కెరీర్ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇక సినిమాలు చాలు అనుకుంటున్నానని, త్వరలో సినిమాలు వదిలేస్తాను అని ఆయన మాటల సారాంశం. అయితే అవి ‘బాహుబలి’ రోజులు. కాబట్టి ఆ సినిమాల తర్వాత ఇక కీరవాణి సినిమాలు చేయరేమో అనుకున్నారంతా.
అయితే, ఆ ట్వీట్‌కి కొన్ని రోజుల్లోనే క్లారిటీ ఇచ్చేశారు కీరవాణి. కానీ ఆ తర్వాత కూడా చాలాసార్లు ఆయన రిటైర్మెంట్ మీద పుకార్లు వచ్చాయి. ప్రతిసారి ఏదో విధంగా ఆయన క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆయన ఆ రోజు సినిమాలు వదులుకుని ఉంటే.. ఇప్పుడు ‘ఆస్కార్’ అవార్డు వచ్చేది కాదు కాబట్టి. ఎవరు మాట విని ఆగిపోయారో ఏమో కానీ దేశానికి చాలా రోజులుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్‌ను అందించారు.
అన్నట్లు రిటైర్మెంట్ చెప్పి మళ్లీ వద్దని కీరవాణి ఏమన్నారో తెలుసా? గతంలో హీరో, దర్శకుడు, నిర్మాత.. ఇలా అందరి సమ్మతితో నడుచుకునేవాడిని. ఆఖరికి నిర్మాత మనవరాలు చెప్పినట్టు కూడా వినేవాడిని. ఇప్పుడు అలా కాదు. వీళ్లలో ఒక్కరి మాటే వింటున్నాను. అలా సగం రిటైర్ అయినట్టే అంటూ చమత్కరించారు కీరవాణి. ఆ లెక్కన ఇప్పుడు కీరవాణి సగం రిటైర్ అయ్యాకనే ఆస్కార్ సాధించారన్నమాట.