2017లో మలయాళంలో విడుదలైన సినిమా “మాయానది”. టోవినో థామస్-ఐశ్వర్య లేక్ష్మి జంటగా తెరకెక్కిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ, అక్కడ యావరేజ్ టాక్ తెచ్చుకొంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో అనువాద రూపంలో విడుదల చేసింది ఆహా యాప్. సో, ఈ లేటెస్ట్ మలయాళం డబ్బింగ్ సినిమా సంగతేంటో చూద్దాం.
కథ: మాధవ్ (టోవినో థామస్) చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరిగా బ్రతుకుతుంటాడు. సంపాదన కోసం తప్పుడు దారి పడతాడు.ఇంజనీరింగ్ టైంలో పరిచయమైన అపర్ణ (ఐశ్వర్య లేక్ష్మి)ని మనస్ఫూర్తిగా ఇష్టపడతాడు కానీ.. కారణాంతరాల వలన విడిపోతారు. కొన్నాళ్ల తర్వాత ఒక మాఫియా కేస్ డీలింగ్ లో అనుకోకుండా పోలీస్ ఆఫీసర్ ను చంపేసి పారిపోతాడు. అప్పట్నుంచి పోలీసులు అతడి కోసం సీరియస్ గా వెతకడం మొదలెడతారు. తన దగ్గరున్న డాలర్స్ ను రూపీస్ గా కన్వర్ట్ చేసి దుబాయ్ వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటాడు మాధవ్. తనతోపాటు అపర్ణను కూడా తీసుకెళ్లాలనుకుంటాడు. అయితే.. అప్పటికే మాధవ్ ను మర్చిపోవడానికి, హీరోయిన్ గా సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటుంది అపర్ణ. సో పోలీస్-మాధవ్-అపర్ణల ట్రయాంగిల్ స్టోరీ ఏ తీరానికి చేరింది? చివరికి ఏం జరిగింది? అనేది “మాయానది” కథ.
నటీనటుల పనితీరు: టోవినో థామస్ మెలమెల్లగా తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్నాడు. అతడు ఎంచుకొనే కథల్లో యూనివెర్సల్ అప్పీల్ ఉండడమే అందుకు కారణం. ఈ సినిమాలోనూ నవతరం యువకుడిగా అతడి క్యారెక్టర్, నటన ఆకట్టుకుంటాయి. ఐశ్వర్య లేక్ష్మి గ్లామర్ & నటనతో అలరించింది. టోవినో థామస్ & ఐశ్వర్య లేక్ష్మిల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. హరీష్ ఉత్తమన్ సినిమాకి హెల్ప్ అయ్యాడు. “ఆకాశం నీ హద్దు రా” ఫేమ్ అపర్ణ బాలమురళీకృష్ణ ఈ చిత్రంలో క్యామియో రోల్ ప్లే చేయడం విశేషం.
సాంకేతికవర్గం పనితీరు: ఆషిక్ అబు కథలు కొత్తగా ఉండవు కానీ.. కథనాలు మాత్రం ఆకట్టుకుంటాయి. “మాయానది” కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. యువతరం కనెక్ట్ అయ్యే కథనం తీసుకున్నాడు కానీ.. కథాంశం స్లోగా సాగడం సినిమాకి మైనస్ పాయింట్. మలయాళంలో అందుకే ఈ చిత్రం యావరేజ్ గా మిగిలిపోయింది. ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ అనేది ఉండదు. ఏదో అలా వెళ్తూ ఉంటుంది. సీన్స్ గా బాగున్నా.. సినిమాగా మాత్రం బోర్ కొడుతుంది. ఎండింగ్ బాగా ప్లాన్ చేసుకున్నాడు కానీ.. కంక్లూజన్ ను మరీ క్లుప్తంగా తేల్చేసాడు. అందువల్ల అసంతృప్తి మిగిలిపోతుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ వంటి అంశాలన్నీ బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కూడా బాగుంది.
విశ్లేషణ: సరదాగా ఒకసారి హ్యాపీగా చూడదగ్గ మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ “మాయానది”. ఐశ్వర్యలెక్ష్మి గ్లామర్ బోనస్ అన్నమాట. సో, మరీ ఎక్కువ లొసుగులు వెతక్కుండా టైంపాస్ కోసం ఆహా యాప్ లో చూసేయండి. బోర్ అయితే కొట్టదు.