తెలుగు సినీ పరిశ్రమలో నాగ చైతన్య, తమిళ పరిశ్రమలో అజిత్ కుమార్ ఇద్దరూ కూడా విషయంలో సేమ్ టూ సేమ్ అని చెప్పవచ్చు. ఇద్దరికి కార్లు బైక్స్ అంటే చాలా ఇష్టం. ఇక రేసింగ్ అంటే ఇంకా పిచ్చి. తరచు రేసింగ్ ఫొటోలలో కూడా పాల్గొనే ప్రయత్నం చేస్తారు. ఇక ఇలాంటి ఇష్టాలున్న ఈ ఇద్దరు స్టార్స్ ఫిబ్రవరిలో బాక్సాఫీస్ వద్ద పోటీపడటానికి సిద్ధమవుతున్నారు. వారి సినిమాలు ఒకే సీజన్ లో విడుదల కానుండటం, అందులోనూ రెండు భాషల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని వస్తుండడంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Naga Chaitanya vs Ajith
అజిత్ కుమార్ తాజా చిత్రం “విడా ముయర్చి” కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలతో హైప్ మరోస్థాయికి చేరింది. అజిత్ గత సినిమాల సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని, ఈసారి కూడా మరింత బలమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు.
ఇదే సమయంలో, నాగ చైతన్య “తండెల్” అనే సినిమాతో కొత్త జానర్‌ను టచ్ చేయబోతున్నాడు. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ చిత్రం నేషనల్ లెవెల్లో మంచి పేరు తెచ్చుకున్న చందు మొండేటి దర్శకత్వంలో రూపొందింది. ప్రేమకథతో పాటు దేశభక్తి అంశాలను హైలైట్ చేస్తూ రూపొందించిన ఈ చిత్రం తమిళనాట కూడా మంచి మార్కెట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అజిత్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ఉండగా, చైతన్య సినిమా కంటెంట్ బేస్డ్ ఎంటర్టైనర్‌గా ఉండటం ప్రత్యేకత. ఒకవైపు అజిత్ తెలుగు మార్కెట్‌లో తన స్థాయిని పెంచుకోవాలని చూస్తుంటే, మరోవైపు చైతన్య తమిళనాడులో పట్టు కోసం చేస్తున్న ప్రయత్నం ఫలితమిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఈ రెండు సినిమాలు వేర్వేరు జానర్లకు చెందినవైనా, బాక్సాఫీస్ రేస్‌లో ఏది టాప్‌లో నిలుస్తుందన్నది ఇప్పుడు వేచిచూడాల్సిన అంశం. చూడాలి మరి ఏం జరుగుతుందో.