తెలుగులో కంటే తమిళంలో అధిక చిత్రాలు చేస్తూ, నయనతార అక్కడ తన హవాను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. లోగడ తెలుగు, తమిళ భాషలలో పలువురు సీనియర్ హీరోల సరసన నటించిన ఆమె కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సీనియర్ హీరోల సరసన నటించేందుకు సమ్మతిని తెలియజేస్తోంది. గత కొంతకాలంగా తమిళంలో జీవా, కార్తీ, శింబు వంటి యువ కథానాయకుల సరసన నటిస్తూ ముందుకు సాగుతున్న ఆమె తాజాగా వెంకటేష్ సరసన “బాబు బంగారం’ చిత్రానికి పచ్చజెండా ఊపడంతో ఇప్పుడామెకు సీనియర్ల సరసన వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయాన్ని అటుంచితే అందులో నయనతారను నాయికగా ఎంపికచేశారని వినిపిస్తోంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించే ఈ చిత్రం స్క్రిప్ట్ పనుల్లో ఉందని అంటున్నారు. దీంతో తొలిసారి మెగాస్టార్ సరసన నయనకు అవకాశం లభించినట్లవుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోయే చిత్రంలో మంచి అవకాశం తనకు లభించడాన్ని ఆమె ఓ అదృష్టంగా భావిస్తున్నట్లు పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.
ఇక రజనీకాంత్ సరసన నాలువసారి నటించే అవకాశం కూడా నయనకు లభించిందట. వాస్తవానికి రజనీకాంత్ సరసన నటించడమన్నది చాలామంది నాయికలకు ఓ కల. త్రిష, హన్సిక వంటివారంతా అలాంటి కల కంటున్నట్లుగా మనసులోని మాటను కొన్ని సందర్భాలలో బయటపెట్టారు కూడా. అయితే నయనతారకు నాలుగవసారి అలాంటి అవకాశం వరించినట్లు సమాచారం. లోగడ “చంద్రముఖి, శివాజీ, కుచేలన్’ చిత్రాలలో వీరు నటించారు. వీటిలో “శివాజీ’ చిత్రంలో సింగిల్ సాంగ్‌లో మాత్రమే నర్తించారు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న “కబాలి, 2.0.’ చిత్రాలు పూర్తయిన తర్వాత మలయాళంలో మమ్ముట్టి నటించిన “భాస్కర్ ది రాస్కెల్’ చిత్రం తమిళ రీమేక్‌లో రజనీకాంత్ నటించనున్నట్లు వినిపిస్తోంది. ఇందులో రజనీ సరసన నయనతారే నాయిక అని అంటున్నారు.
ఇదిలావుండగా, హిందీలో కంగనారనౌత్ నటించిన “క్వీన్’ చిత్రం దక్షిణాదిలో తమిళ, తెలుగు, మలయాళ భాషల రీమేక్ హక్కులను తమిళ నటుడు త్యాగరాజన్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఎప్పట్నుంచో మూడు భాషల్లో పేరున్న కథానాయికను ఈ చిత్రానికి ఒప్పించాలని త్యాగరాజన్ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నయనతారను కూడా సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికీ, కెరీర్ పరంగా పదేళ్లు పూర్తయినప్పటికీ చేతినిండా చిత్రాలతో నయన ఊపిరిసలపనంత బిజీగా ఉండటం విశేషం.