అవకాశం ఉన్నప్పుడు అదరగొట్టాలి… అవకాశం లేనప్పుడు గమ్మునుండాలి అంటారు. దీనిని సినిమా పరిశ్రమకు అన్వయిస్తే… సీజన్ వచ్చినప్పుడు సినిమాలు విడుదల చేసి వసూళ్లు సాధించాలి. సీజన్ లేనప్పుడు సినిమా పనులు చేసుకోవాలి. అయితే కరోనా పరిస్థితుల వల్ల సినిమాలకు సీజన్ అనేది లేకుండా పోయింది. వర్షాకాలం వర్షం తెరిపినిస్తే… బయటికొచ్చి సరుకులు కొనుక్కున్నట్లు, కరోనా తెరిపి నిచ్చినప్పుడు సినిమా విడుదల చేసి డబ్బులు సంపాదించుకోవాలి. టాలీవుడ్ పై కొత్త అనధికారిక రూల్స్‌ను పెద్దగా పాటించాలని అనుకోవడం లేదేమో అనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు విడుదల చేసుకోవచ్చు అని ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చేసినా… నిర్మాతలు తమ సినిమాలు విడుదల చేయడానికి ముందుకు రావడం లేదు. నిజానికి ఈ నెల సినిమాలొస్తాయని చాలా మంది అనుకున్నారు. అయితే ఏపీలో టికెట్ల రేట్ల విషయం తేలకపోవడం, 50 శాతం ఆక్యుపెన్సీ ఉండటం వల్ల నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. అయితే కేవలం తెలంగాణలోనే సినిమాలు విడుదల చేయడం ఎలాగూ కుదరని పని. దీంతో నిర్మాతలందరూ ఆగస్టుపై గురి పెట్టారట.
కొత్త సినిమాల రాకడ ఆగస్టు నుండి మొదలవుతుందట. ఆగస్టు 6న నాగచైతన్య `లవ్‌స్టోరీ` విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 13న నాని `టక్ జగదీష్` తీసుకొస్తారట. ఆ వెంటనే `విరాటపర్వం` వస్తుందట. ఇలా ఆగస్టు కోసం భారీ ప్లాన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ నెలాఖరున ‘తిమ్మరసు’ విడుదల చేస్తాం అని నిర్మాతలు తెలిపారు. కాబట్టి దాంతోనే మొదలేమో.