మోహన్ లాల్ (Mohanlal) సినిమాల్లో స్టైలిష్ యాక్షన్ డ్రామాగా పేరొందిన చిత్రం ‘లూసిఫర్’. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమానే తెలుగులో చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్ ఫాదర్’గా (Godfather) చేసిన విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎల్2: ఎంపురాన్’ (L2: Empuraan) సినిమా రెడీ అయింది. ఈ సారి రీమేక్‌లకు అవకాశం ఇవ్వకుండా మలయాళ సినిమాను పాన్ ఇండియా అంటూ తెలుగుతోపాటు హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
సినిమాను ఈ నెల 27న విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇటీవల సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆ కార్యక్రమంలో మోహన్ లాల్ మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు కొన్ని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను రూపొందించేందుకు ఏడేళ్లపాటు శ్రమించాం. గొప్పగా తెరకెక్కించిన పృథ్వీరాజ్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా సిరీస్ ఇక్కడితో ఆగడం లేదు. మూడో పార్టు కూడా ఉంది అని క్లారిటీ ఇచ్చారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ‘లూసిఫర్’ సినిమాను మూడు భాగాలుగా రూపొందించాలి అనుకునే సిద్ధం చేశాం. తొలి భాగం భారీ విజయాన్ని సాధించింది. దీంతో రెండో భాగం విషయంలో జాగ్రత్తలు ఇంకా అవసరం అనిపించింది. అందుకే కాస్త టైమ్ తీసుకొని 2022లో మోహన్ లాల్‌ను కలిసి ‘ఎల్2: ఎంపురాన్’ కథ చెప్పాను. ఆయన ఓకే అనడంతోనే సినిమా స్టార్ట్ చేశాం అని చెప్పారు.
ఈ సినిమా కాస్టింగ్, క్రూ విషయంలోనే కాదు సాంకేతిక విషయంలోనూ భారీగానే ఉంది. ఎందుకంటే మలయాళ సినిమా చరిత్రలో తొలిసారి ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో వస్తోంది. సినిమాను మరింత నాణ్యతతో చూపించే క్రమంలోఏ ఈ ఫార్మాట్‌లో సినిమాను తీసుకొస్తున్నామని టీమ్ చెబుతోంది. ‘లూసిఫర్’ 2019లో రాగా, ఇప్పుడు 2025లో ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2 Empuraan) తీసుకొస్తున్నారు. మరిప్పుడు మూడో ‘లూసిఫర్’ ఎప్పుడు వస్తుందో చూడాలి.