2015లో “బెంగాల్ టైగర్”తో ప్రేక్షకుల్ని మెప్పించిన మాస్ మహారాజా రవితేజ మళ్ళీ వెండితెరపై కనిపించి అప్పుడే రెండేళ్లవుతోంది. మధ్యలో కాస్త బోర్ కొట్టి రెండేళ్లు గ్యాప్ తీసుకొన్న రవితేజ “రాజా ది గ్రేట్” అంటూ ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటించడం విశేషం. “పటాస్, సుప్రీమ్” సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా రవితేజ ఫ్యాన్స్ తోపాటు మన ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ : ఓ పోలీస్ ఆఫీసర్ (ప్రకాష్ రాజ్) తన వృత్తిని సక్రమంగా నిర్వర్తించడం వల్ల.. దేవరాజ్ అనే లోకల్ రౌడీ తన తమ్ముడ్ని కోల్పోతాడు. తమ్ముడు పోయాడన్న బాధతో ఆ పోలీస్ ఆఫీసర్ బ్యాచ్ తోపాటు అతడి కుమార్తె లక్కీ (మెహరీన్)ను చంపాలనుకొంటాడు దేవరాజ్. తమ ప్రాణాలను అడ్డుపెట్టి మరీ లక్కీ ప్రాణాలను కాపాడతారు పోలీస్ ఆఫీసర్స్. అయితే.. లక్కీని చంపి తన తమ్ముడి కోరిక అయిన ఎమ్మెల్యే అవ్వడమే ధ్యేయంగా పెట్టుకొన్న దేవరాజ్.. లక్కీని పట్టుకోవడం కోసం ఒక్కో నగరానికి ఒక్కో బ్యాచ్ ను పంపి లక్కీని వెతికిస్తుంటాడు. లక్కీని కాపాడడం కోసం ప్రకాష్ రాజ్ స్నేహితుడు అసిస్టెంట్ కమీషనర్ (సంపత్ రాజ్) రాజా ది గ్రేట్ (రవితేజ) అండ్ బ్యాచ్ ను డార్జీలింగ్ పంపుతాడు. అత్యంత క్రూరుడు, శక్తిమంతుడు అయిన దేవరాజ్ అండ్ బ్యాచ్ ను మామూలు వ్యక్తులే ఎదుర్కోలేకపోతున్న తరుణంలో.. పుట్టుకతోనే అంధుడైన రాజా ఎవరి సహాయం లేకుండా లక్కీని ఎలా కాపాడాడు, అందుకోసం అతడు ఎదుర్కొన్న సమస్యలేమిటి అనేది “రాజా ది గ్రేట్” ఇతివృత్తం.
నటీనటుల పనితీరు : నటుడిగా రవితేజకు ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకొంటే.. అంధుడిగా కనిపించడం కోసం ఆయన ఎక్కువ కష్టపడలేదనిపిస్తుంది. హీరో అంధుడు అనే విషయం “అయామ్ బ్లైండ్.. బట్ ఆయామ్ ట్రైన్డ్” అని హీరో పలుమార్లు గుర్తుచేస్తే తప్ప ఆడియన్స్ కు రిజిష్టర్ అవ్వదు. హీరో క్యారెక్టర్ ను మాగ్జిమమ్ కామెడీగానే ఎలివేట్ చేయడం వల్ల.. అంధుడిగా హీరో పాత్ర పడిన శ్రమ లేక ఇబ్బందులను ఎక్కడా చూపించలేదు. ఆ కారణంగా లాజిక్ లేని కామెడీని ఎంజాయ్ చేసేవారు ఓ మోస్తరుగా ఎంజాయ్ చేసే రాజా ది గ్రేట్ క్యారెక్టరైజేషన్ ను ప్రతి సన్నివేశానికి లాజిక్ వెతికే రెగ్యులర్ మూవీ గోయర్స్ కి మింగుడుపడదు.
మెహరీన్ క్యారెక్టర్ లో పెద్దగా చెప్పుకోదగిన షేడ్స్ లేవు. అయితే.. ఎమోషన్ పండించాల్సిన సన్నివేశాల్లో “అమాయకత్వానికి – ఆశ్చర్యానికి” మధ్యలో నలిగిపోయే నగుమోముతో అమ్మడు కాస్త కన్ఫ్యూజ్ చేసింది. పెర్ఫార్మెన్స్ విషయంలో రవితేజ ఎనర్జీని అందుకోలేకపోయిన మెహరీన్ డ్యాన్స్ విషయంలోనూ తేలిపోయింది. రవితేజ ఫ్రెండ్ గా శ్రీనివాసరెడ్డి సపోర్టింగ్ రోల్ లో తనదైన శైలి కామెడీ పంచ్ డైలాగ్స్ తో, మ్యానరిజమ్స్ తో నవ్వించాడు. దేవరాజ్ పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు వివాన్ భతేనా క్యారెక్టరైజేషన్ “ఏక్ నిరంజన్” సినిమాలో సోనూసూద్ ను తలపిస్తుంది. విలన్ చేత కూడా కామెడీ పండించేయడంతో.. విలనిజం కానీ, విలన్ హీరోయిన్ చంపాలనుకొనే ధ్యేయం కానీ పెద్దగా ఎలివేట్ అవ్వవు. రవితేజ తల్లి పాత్రలో రాధిక, రవితేజ చిన్నప్పటి పాత్రలో ఆయన తనయుడు మహాధన్ ఆకట్టుకొన్నారు. ప్పాలంటే.. అంధుడిగా రవితేజ కంటే ఆయన తనయుడే మంచి నటన కనబరిచాడు. తనికెళ్లభరణి, సంపత్ రాజ్, రాజేంద్రప్రసాద్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : సాయికార్తీక్ సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్కడో విన్నట్లే అనిపిస్తాయి. అయితే.. కాపీ కొట్టినా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ ను బాగా హైలైట్ చేశాడు. మోహనకృష్ణ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. డార్జీలింగ్ ఎపిసోడ్స్, ఫైట్ సీక్వెన్స్ లను బాగా చూపించారు. హీరోహీరోయిన్లు చీకట్లో విలన్ బ్యాంచ్ నుండి తప్పించుకొనే సన్నివేశం కోసం హాలీవుడ్ చిత్రం “డోన్ట్ బ్రీత్” నుండి ఇన్స్పైర్ అయినప్పటికీ.. కామెడీ యాడ్ అవ్వడంతో ఆ ఎపిసోడ్ బాగా పండింది.
డైలాగ్స్ బాగున్నాయి, ఎక్కడా నరికేస్తా, చంపేస్తానంటూ గోల చేయకుండా చాలా డీసెంట్ గా హీరో ఫోన్ లో విలన్ ను “వచ్చి వినపడు” అని చెప్పడం, ముఖ్యంగా తనికెళ్లభరణి కొడుక్కి “వాడికి కనపడదు కదరా, వాడికి నీ పవర్ ఎలా చూపిస్తావ్” అని చెప్పే డైలాగ్స్ ఫన్ జనరేట్ చేయడంతోపాటు.. హీరో డీసెబిలిటీని హీరోయిజంగా హైలైట్ చేశాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే.. ట్రైన్ చేజ్ సీక్వెన్స్ కాస్త అతి అనిపిస్తుంది. అక్కడ కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.
దర్శకుడు అనిల్ రావిపూడి “సుప్రీమ్” ఫార్మాట్ నే “రాజా ది గ్రేట్” కోసం కూడా వాడేశాడు. “సుప్రీమ్”లో హీరో సాయిధరమ్ తేజ్ కు ఒక చిన్నపిల్లాడ్ని కాపాడడం గోల్ అయితే.. “రాజా ది గ్రేట్”లో రవితేజకు మెహరీన్ ప్రాణాలు కాపాడడమే ధ్యేయం. పైగా.. హీరో అంధుడు అనేది మధ్యలో హీరో తన డైలాగ్స్ తో గుర్తుచేస్తే తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు. ఎక్కడా హీరో ఇబ్బందిపడడం లేదా కష్టపడడం లాంటివి మచ్చుకకు కూడా కనిపించవు. అందువల్ల కథలోని ఇంటెన్సిటీ ఆడియన్స్ కు పెద్దగా కనిపించదు, వినిపించదు. ఇక కామెడీ సన్నివేశాలను మాగ్జిమమ్ హీరో డీసెబిలిటీని బేస్ చేసుకొని రాసుకొన్నవే కావడంతో.. ఓ మోస్తరు హాస్యం పండింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్లుగా “గున్న గున్న మామిడి” సాంగ్ పిక్చరైజేషన్ మాస్ ఆడియన్స్ కు మసాలా ట్రీట్ లాంటిది.
విశ్లేషణ : గత రెండేళ్లుగా తమ అభిమాన కథానాయకుడు రవితేజను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోడానికి వెయిట్ చేస్తున్న మాస్ మహారాజా ఆడియన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్ లాంటిది. మాస్ మెచ్చే ఫైట్స్, కామెడీ పుష్కలంగా ఉండడంతో “రాజా ది గ్రేట్” వారికి విపరీతంగా నచ్చేస్తుంది. ఓ సినిమాకు మహారాజా పోషకులు మాస్ ఆడియన్సే కాబట్టి సినిమా హిట్ కొట్టినట్లే.అయితే.. లాజిక్స్, స్క్రీన్ ప్లే, సెన్స్ లాంటివి పట్టించుకొనే కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రం “రాజా ది గ్రేట్” యావరేజ్ సినిమా. మొత్తానికి.. రవితేజ సెకండ్ ఇన్నింగ్స్ కు బంపర్ స్టార్ట్ “రాజా ది గ్రేట్”.
రేటింగ్ : 2.5/5