శర్వానంద్ అంటే మంచి ప్రామిసింగ్ హీరో, టేస్ట్ ఉన్న హీరో అని ప్రేక్షకులు నమ్ముతారు. ఇతని కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ.. తన కొత్త సినిమాలకు క్రేజ్ పెరగడానికి కారణం అదే అని చెప్పాలి. అయితే గత 5,6 సినిమాల నుండి శర్వానంద్ ప్లాపుల్లో కూరుకుపోయాడు. మినిమమ్ గ్యారంటీ అనుకున్న సినిమాలు కూడా ప్లాప్ అవుతున్నాయి. ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ఇలా అన్ని సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్లు అయ్యాయి.
త్వరలో ‘ఒకే ఒక జీవితం’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శర్వానంద్. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఈసారి కచ్చితంగా శర్వానంద్ హిట్ కొడతాడు అనే భరోసా ఇచ్చాయి. సెప్టెంబర్ 9న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమోషన్లలో కూడా శర్వానంద్ చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా తరుణ్ భాస్కర్ తో చేసిన ఓ ఇంటర్వ్యూలో ఈ మధ్య కాలంలో తనని బాగా డిజప్పాయింట్ చేసిన మూవీ ‘పడి పడి లేచె మనసు’ అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చాడు.
శర్వానంద్ మాట్లాడుతూ.. “నా గత 4,5 సినిమాల విషయంలో నేను తీసుకున్న నిర్ణయాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. చెప్పాలంటే ప్లాప్ సినిమాలు కూడా మనకు బాగా హెల్ప్ చేస్తాయి. భవిష్యత్తులో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది నేర్పుతాయి. ‘పడి పడి లేచే మనసు’ సినిమా ఉంది. నేను ఆ సినిమాని చాలా నమ్మి చేశాను.
ఎంత నమ్మాను అంటే కచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది అని 130,140 రోజులు కష్టపడి పనిచేశాను ఎండల్లో, వానల్లో .. ఏది లెక్క చేయకుండా కష్టపడి చేశాను. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను. ఒక 3 నెలల పాటు నేను బయటకు రాలేదు ఆ సినిమా రిజల్ట్ వల్ల. నేను దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.