తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అని రెండు ఏర్పాట్లు ఉన్నాయి. ఇందులో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. ఎక్కువగా అప్‌డేట్లు ఉంటూ ఉంటాయి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ విషయంలో ఇది తక్కువగా ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఛాంబర్ సభ్యులు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు. అంతకుముందు జరిగిన ఛాంబర్ ఎన్నికలు. ఇప్పుడు ప్రెసిడెంట్ రాజీనామా కూడా.
అవును, మీరు చదివింది నిజమే. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ (Suniel Narang) రాజీనామా చేశారు. ఎన్నికైన ఒక్క రోజులోనే ఆయన బాధ్యతల నుండి దిగిపోయారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దీంతో ఈ విషయం తెలుగు సినీ వర్గాల్లో సంచలనమైంది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో టీఎఫ్‌సీసీ కొత్త పాలక మండలిని ప్రకటించారు. మూడోసారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ సహా 15 మంది ఎగ్జిక్యూటివ్ ప్యానల్‌ను ఎలెక్ట్ చేసుకున్నారు.
తనని సంప్రదించకుండానే టీఎఫ్‌ఎసీసీలో కొందరు ప్రకటనలు ఇస్తున్నారని సునీల్ నారంగ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తన ప్రమేయం లేకుండా ఇచ్చిన ప్రకటనలకు తాను బాధ్యుడిని కాదని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా అధ్యక్ష పదవిలో కొనసాగలేనని స్పష్టం చేశారు. అందుకే ఇమ్మిడీయట్ ఎఫెక్ట్‌తో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఛాంబర్‌కి తగ్గ అధ్యక్షుణ్ని ఎన్నుకోవాలని కూడా ఆయన ఆ ప్రకటనలో కోరారు.
ఇదంతా చూస్తుంటే రెంటల్, పర్సెంటెజ్ అంశాల కన్నా తీవ్రమైన సమస్యలు కొన్ని పరిశ్రమలో ఉన్నాయని నారంగ్ రాజీనామా వ్యవహారంతో అర్థమవుతోంది. అంతర్గతంగా ఉన్న ఛాంబర్ విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి వీటిని ఛాంబర్ సభ్యులు ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి. ఎందుకంటే ఇలాంటి అభిప్రాయ భేదాలు మొత్తంగా సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడతాయి.