తమిళనాట మాత్రమే కాదు యావత్ సౌత్ ఇండియాలోనే విజయ్ ఆంటోనీ లాంటి హీరో లేడేమో. ఇలా అనడానికి కారణం ఏంటంటే.. విజయ్ ఆంటోనీ కేవలం హీరో మాత్రమే కాదు.. ఆయన ఓ సంగీత దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ మరియు వి.ఎఫ్.ఎక్స్ ఆర్టిస్ట్ కూడా. ఆయన సినిమాల్లో కథానాయకుడిగా నటించడమే కాదు.. తన సినిమాలను తానే ఎడిట్ చేసుకొంటాడు.. డి.టి.ఎస్ మిక్సింగ్ మొదలుకొని డి.ఐ వరకూ అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన నటించే సినిమాలన్నిటికీ ఆయనే నిర్మాత అవ్వడం కూడా అందుకు కారణం అనుకోవచ్చు. అయితే.. ఒక సినిమాకి ఇన్ని రకాలుగా వర్క్ చేయడం వల్ల అలిసిపోయాడో లేక.. సినిమాల రిజల్ట్స్ కారణంగా నీరసించాడో తెలియదు కానీ.. ఇకపై సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంటాను అంటున్నాడు విజయ్ ఆంటోనీ.
ఆయన నటించిన “రోషగాడు” గత శుక్రవారం విడుదలైంది. కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ.. సరైన స్క్రీన్ ప్లే లేకపోవడంతోపాటు తమిళ వాసన కాస్త ఎక్కువవ్వడంతో ప్రేక్షకులు ఆ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో.. ఒక హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా తనకున్న ప్లస్ పాయింట్స్ ను మాత్రమే కాన్సన్ ట్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట విజయ్. పైగా.. నిర్మాతగా తాను ఎదుర్కొన్న సమస్యలు కూడా చాలా దారుణంగా ఉండేవని ఆయన చెప్పడం విశేషం. మరి విజయ్ తదుపరి చిత్రాల పరిస్థితి ఏమవుతుందో చూడాలి.