రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయన మాత్రమే కాదు సినీ పరిశ్రమ నుండి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కి కూడా ఈ అరుదైన గౌరవం దక్కింది.వీరితో పాటు క్రీడారంగం నుండి పి.టి ఉషని, ప్రముఖ ఫిలాంత్రఫిస్ట్ అయిన వీరేంద్ర హెగ్డే ని కూడా రాజ్యసభకు నామినేట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రపతి కోటాలో వీరిని రాజ్యసభకు నామినేట్ చేసినట్లు స్పష్టమవుతుంది.
ఈ నలుగురు కూడా సౌత్ కు చెందిన సెలబ్రిటీలే కావడం విశేషంగా చెప్పుకోవాలి. వివిధ రంగాల్లో దశాబ్దాల కాలం నుండి సేవలు అందించిన వారికి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర ఈ విషయాన్ని వారికి ఫోన్ చేసి అభినందించడంతో పాటు, ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించడం జరిగింది. ఇక విజయేంద్ర ప్రసాద్ రచనలు భారతదేశం నలుమూలల దాగి ఉన్న సంస్కృతి ని తెలియజేశాయి అని, ఎన్నటికీ చెరగని ముద్ర వేశాయని ఈ సందర్భంగా మోడీ పేర్కొన్నారు.
‘బాహుబలి'(సిరీస్), ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి చిత్రాలు దేశం గర్వించదగ్గ సినిమాలుగా మిగిలాయి. ఇవి మాత్రమే కాదు ఆయన కథ అందించిన ‘బజరంగీ భాయిజాన్’ వంటి చిత్రాలు కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక ఇళయరాజా గారి పాటల ప్రభావం ఇప్పటికీ జనాల ఫై ఉంది. ఇప్పటికీ చాలా మంది నిద్రపట్టకపోతే ఇళయరాజా గారి పాటలే వింటూ ఉంటారు. ఇక వీరి పై నరేంద్ర మోడీ చేసిన ట్వీట్లు కూడా వైరల్ గా మారాయి.