‘గాడ్ ఫాదర్’.. కుటుంబం చుట్టూ తిరిగే ఓ రాజకీయ చిత్రం. ఇంకా చెప్పాలంటే రాజకీయ చదరంగం. అందులో పక్కాగా పావులు కదిపి అదిరిపోయే విజయం అందుకున్నారు మెగాస్టార్. అయితే పనిలోపనిగా, అంతర్లీనంగా తన రాజకీయ ఉద్దేశాలను కూడా చెప్పారా? సినిమాను నిశితంగా పరిశీలించిన కొంతమంది ఫ్యాన్స్, సినిమా పరిశీలకులు అంటున్నారు. ఈ సినిమాలో ప్రస్తుత రాజకీయాలపై సెటైర్లు బలంగానే ఉన్నాయి. అలాగే అన్యాపదేశంగా కొంతమందిని కౌంటర్ చేశారు అని కూడా అనొచ్చు.
మలయాళ మాతృక ‘లూసిఫర్’ కథ, ‘గాడ్‌ఫాదర్’ కథ రెండూ ఒకటే. అయితే వాటిని ముందుకు తీసుకెళ్లే విషయంలో మార్పులు జరిగాయి. అలాగే ‘అధికార దాహం’ అనే పాయింట్‌ను కూడా అంతే బలంగా చూపించారు. ఈ క్రమంలోనే నేటి రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు, చెంపపెట్టు సన్నివేశాలను చూడొచ్చు. సినిమాలో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చనిపోతే.. ఆయన పార్థివ దేహం దగ్గరే రాజకీయాలు చేస్తూ కనిపిస్తాయి ముఖ్య పాత్రలు. ఇలాంటి ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్నేళ్ల క్రితం చూశాం.
సినిమాలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పేరు విషయంలోనూ పంచ్ కనిపిస్తుంది. ప్రతిపక్ష నాయకుడి పేరు, నిజ రాజకీయంలో ప్రతిపక్ష నాయకుడి పేరుకు దగ్గరగా ఉండటం గమనార్హం. రాజకీయ నాయకులు తమ కుటుంబ సభ్యుల వ్యాపారాల కోసం ఎలాంటి పనులకు దిగజారుతారు అనేది కూడా ఈ సినిమాలో చూడొచ్చు. పార్టీలో కీలక నేతగా ఉండే వ్యక్తి అవతలి పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం, పార్టీని లాగేసుకోవాలని అనుకోవడం లాంటివి కూడా తెలుగు రాజకీయాల్లో చూశాం.
నిజానికి ఇలాంటి సన్నివేశాలు ‘లూసిఫర్’లో లేవు. అక్కడ బాబీ (వివేక్ ఒబెరాయ్) కేవలం తన వ్యాపారం కోసం.. తనకు కావాల్సిన వాడిని సీఎంగా కూర్చోబెట్టాలి అనుకుంటాడు. కానీ ఇక్కడ ఆ వ్యాపారవేత్త సీఎం అవ్వాలని అనుకుంటాడు. ఈ తెలుగు రాజకీయాల వాసన సినిమాకు ఎంతవరకు మంచి చేసిందో పక్కనపెడితే.. చిరంజీవి మనసులోని రాజకీయ భావాల్ని మాత్రం చూపించింది అని చెప్పొచ్చు. ఇక బ్రహ్మ పార్టీ పేరు అయిన జేజీపీ, రెండు పిడికిళ్ల గుర్తు లాంటివి కూడా తెలుగు రాజకీయాలకు బాగా దగ్గరవే. అయితే ఈ మాటలకు చిరంజీవి నో చెప్పారు అనుకోండి. అలా లేదు లేదు అంటూ ‘గాడ్‌ఫాదర్’లో రాజకీయ వాసనలు ఉన్నాయి.