‘షికారుకొచ్చిన షేర్‌ని.. ’, ‘ఇస్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే… ఆల్ ఏరియాస్ అప్నా హై.. నా హద్దులు లేవ్.. సరిహద్దుల్లేవ్’… ఈ రెండు డైలాగ్‌లు అదిరిపోయాయ్ కదా. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలోని డైలాగ్స్ ఇవి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా టీజర్ ఇటీవల వచ్చి యూట్యూబ్‌లో దుమ్ము దులుపుతోంది కూడా. ఫ్యాన్స్ కూడా ఈ వీడియో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చిరు లుక్స్, అప్పీయరెన్సే దీనికి కారణం. అయితే ఎక్కడో చిన్న వెలితి ఉంది అంటున్నారు.
అంతా బాగుంది కదా.. డైరెక్టర్ మెహర్ రమేశ్ తరహా స్టైల్‌లో(Chiranjeevi) చిరంజీవి లుక్ బాగుంది, డైలాగ్స్ కూడా క్యాచీగా ఉన్నాయి కదా.. మళ్లీ ఏంటీ వెలితి అనుకుంటున్నారా? ఉంది.. సగటు చిరు అభిమాని మాట ఇది. చిరంజీవి తెలంగాణ యాసలో కాస్త ఇబ్బంది పడ్డాడు అనిపిస్తోంది. డైలాగ్‌ను డైలాగ్‌లా కాకుండా కాస్త ఒత్తి పలకడం, మాడ్యులేషన్ మార్చే క్రమంలో చిరంజీవి ట్రేడ్ మార్క్ మిస్ అవ్వడం లాంటివి అయ్యాయి అనిపిస్తోంది. అంతేకాదు ఏదో డైలాగ్‌ను సాగదీసినట్లుగా ఉంది అని కూడా అంటున్నారు.
ఇప్పటికే టీజర్‌లో కొత్తగా ఏమీ లేదు అని టాక్ నడుస్తున్న సమయంలో… ఈ మాడ్యులేషన్ పంచాయితీ రావడం అదనం. చిరంజీవికి సాధారణ టాలీవుడ్ సినిమాల యాస, ఉత్తరాంధ్ర యాస, గోదావరి యాస బాగా నప్పుతాయి. రాయలసీమ యాస కూడా ఫర్వాలేదు. కానీ తెలంగాణ యాసనే కాస్త కృతకంగా అనిపిస్తోంది అంటున్నారు. హిందీ వరకు బాగానే ఉన్నా..యాసనే ఇబ్బంది అని చెప్పొచ్చు. మరి టీజర్‌కు వస్తున్న స్పందన చూసి టీమ్ ఏమైనా మాడ్యులేషన్, యాస విషయంలో జాగ్రత్త తీసుకుంటుందేమో చూడాలి.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది. చిరు సోదరిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా, తమన్నా కథానాయిగా నటిస్తోంది. ఇక సుశాంత్ మరో ముఖ్య పాత్రలో కనిపిస్తాడు. ఆగస్టు 11న థియేటర్లలో భోళా వస్తాడు.