మెగాస్టార్ కుటుంబ సభ్యులు ఒకే దారిలో నడుస్తున్నారు. పేపర్ మీద ఉన్న కథ కంటే .. రీల్ పైకి ఎక్కిన కథపైనే మక్కువ పెంచుకుంటున్నారు. తమిళంలో హిట్ సాధించిన సినిమాలనే రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత వెండి తెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందుకోసం ఎన్నో కథలను విన్న చిరు సంతృప్తి చెందలేదు. తమిళంలో విజయ్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన “కత్తి” సినిమా నచ్చడంతో ఆ కథను తీసుకున్నారు. అందుకు పరుచూరి బ్రదర్స్ కలాన్ని జోడించి కత్తిలాంటోడు గా మెరుగులుదిద్దించారు. వి.వి.వినాయక్ చేత కొత్తగా ఆవిష్కరించే పనిలో చిరు పడ్డారు.
తండ్రి కంటే ముందే తనయుడు చెర్రీ తమిళ కథను ఎంపిక చేశారు. గత ఏడాది తమిళంలో హిట్ సాధించిన “తని ఒరువన్” చిత్రాన్ని రీమేడ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేందర్ రెడ్డి ఈ కథతో రామ్ చరణ్ తేజ్ కి సూపర్ హిట్ అందించే పనిలో బిజీగా ఉన్నారు.
ఎప్పుడూ ఫ్రెష్ స్టోరీలను ఓకే చేసే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ నుంచి తన పంథా మార్చుకున్నారు. హిందీ దబాంగ్ రీమేక్ తనని హిట్ ట్రాక్ లోకి నడిపించింది. అందుకే పక్క కథలపై దృష్టి పెట్టారు. తన గత చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్ తర్వాత తప్పకుండా హిట్ అవసరమని భావించి తమిళ్ సూపర్ హిట్ సినిమాను ఎంచుకున్నారు. అజిత్ నటించిన “వీరమ్” మూవీని తెలుగు వారికి తన స్టయిల్ లో అందించడానికి కృషి చేస్తున్నారు. రచయిత ఆకుల శివ తో భారీ మార్పులు చేయించి ఖుషి డైరక్టర్ సూర్య చేతిలో పెట్టారు. అతను నటుడిగా బిజీ కావడంతో గోపాల గోపాల దర్శకుడు డాలీ కి తన సినిమా భాద్యతలు అప్పగించారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇలా మెగాస్టార్, పవర్ స్టార్ , మెగా పవర్ స్టార్ లు హిట్ అందుకోవడానికి తమిళ కథల బాటను ఎంచుకున్నారు.