వినోదంతోపాటు సందేశం ఇవ్వడం కొరటాల శివకు అలవాటు. ఆయన దర్శకుడిగా చేసిన సినిమాలు అన్నీ ఇలాంటి నేపథ్యంలోనివే. రెండు విభిన్న అంశాలను మాస్ ఎలిమెంట్స్‌కు జోడించి భలేగా తీస్తుంటారు. అలాంటి కొరటాల మనసు జీవిత కథల మీద పడిందా? ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వివరాలే దీని కారణం. ఇటీవల కాలంలో ఆయన జీవిత కథల్ని ఎక్కువగా చదువుతున్నారట. దీని గురించి ఆయనే చెప్పారు. పుస్తకాల చదివే అలవాటు కొరటాలకు ముందు నుండీ ఉందట.
ఈ మధ్య ప్రత్యేకంగా జీవిత చరిత్రలు చదువుతున్నారట. మనుషులు, వాళ్ల జీవితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారట. ‘‘కొంతమంది ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తులు వాళ్ల జీవిత అనుభవాలతో పుస్తకాలు రాస్తుంటారు. అలాంటివన్నీ చదువుతున్నాను. వాళ్ల కోణాల్లో వాళ్ల అనుభవాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను’’ అని కొరటాల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో, పరిస్థితులు అనుకూలించని వాతావరణంలో చిత్తశుద్ధితో పనిచేసిన ఓ పోలీస్ అధికారి కథ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, ఎక్కడో ఉన్న ఓ యోగి కథ తెలియకపోవచ్చు.
వాళ్ల జీవితాల్లో జరిగిన ఆసక్తికరమైన కథల గురించి అందరికీ తెలియాలి. జీవితంలో కీలక సమయంలో వాళ్లు తీసుకున్న నిర్ణయాలు చదువుతున్నప్పుడు భలే ఆసక్తి కలిగిస్తాయి. ఒక్కోసారి మనకు తెలియని ఇన్ని కథలు, వ్యక్తిత్వాలు ఉన్నాయా అని అనిపిస్తుంటుంది అని తన పుస్తక పఠనం గురించి చెప్పారు కొరటాల. కరోనా పరిస్థితులు – లాక్‌డౌన్ సమయంలో కొన్ని ఆలోచనల్ని రాసుకున్నారట కొరటాల. వాటిని కథలుగా మలిచే ప్రక్రియ కొనసాగుతోంది అని చెబుతున్నారు.
అయితే ఇప్పుడు కొరటాల జీవిత కథలు చదువుతున్నారు అంటే ఎవరైనా గొప్పవారి జీవితం గురించి సినిమా తీద్దాం అనుకుంటున్నారా? అనే ప్రశ్న కచ్చితంగా వస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం ఓ కథ సిద్ధం చేశారు. ఓ విద్యార్థి నాయకుడిగా కథగా ఆ సినిమా ఉంటుందట. ఆ తర్వాత ఏమైనా జీవిత కథ చేస్తారేమో చూడాలి. అన్నట్లు మంచి కథలు, నచ్చిన కాన్సెప్టులతో సినిమా నిర్మాణం చేపట్టాలనేది ఆయన ఆలోచనట. భవిష్యత్తులో అలా నిర్మాతగా మారే అవకాశం ఉందటున్నారు కొరటాల.