ఏ రంగంలోకి అయినా… పక్కా ప్లానింగ్‌తో రావడం అంటే ఏంటో తెలియాలంటే మై హోమ్ సంస్థను చూసి తెలుసుకోవచ్చు అంటారు. కన్‌స్ట్రక్షన్ కంపెనీగా గత కొన్నేళ్లుగా రాణిస్తున్న ఈ సంస్థ ఇటీవల మీడియాలోకి వచ్చింది, ఆ వెంటనే ఎంటర్‌టైన్మెంట్ రంగంలోకి వచ్చి ఓ ఓటీటీ పెట్టింది. ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి కూడా వస్తోందనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే… ఈ రంంలో కూడా మై హోం సంస్థ తన స్థాయి ప్రతాపం తప్పక చూపిస్తుంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
నిర్మాణ రంగంలో అగ్రగామిగా రాణిస్తున్న మై హోం సంస్థ టీవీ9 ఛానల్‌ను నిర్వహిస్తోంది. ‘ఆహా’తో ఎంటర్‌టైన్మెంట్ రంగంలోకి వచ్చేసింది. ఈ రెండూ విజయవంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి రాబోతోంది. అయితే అందరిలా నేరుగా కాకుండా… తమ స్ట్రాటజీని వాడుతూనే వస్తోంది అంటున్నారు. అంటే డైరెక్ట్ అటాక్ కాకుండా… పార్టనర్స్‌గా స్టార్ట్ చేసే ఆలోచన ఉందట. ఇటీవల ముహూర్తం షాట్ పడిన ఓ ప్రముఖ – హీరో దర్శకుడు కాంబినేషన్‌లో ఓ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా చేరిందట.
ఇది కాకుండా మరికొన్ని పెద్ద నిర్మాణ సంస్థల్లో కూడా భాగస్వామి అవుతోందట. అలా సినిమా నిర్మాణంలో అడుగుపెట్టి… అనుభవం, వాటా రెండూ సంపాదిస్తారు. ఆ తర్వాత పూర్తి స్థాయి బ్యానర్ పెడతారు అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై మై హోం నుండి ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. పూర్తిస్థాయి నిర్మాణ సంస్థగా మారినప్పుడే బ్యానర్ నేమ్, డిటైల్స్ బయటకు వస్తాయి అంటున్నారు. అలాగే సినిమా మ్యూజిక్ స్ట్రీమింగ్ రంగంలోకి కూడా మైహోం టీమ్ వస్తుందని అంటున్నారు.
దీని కోసం ఆడియోల రైట్స్, డిజిటల్ రైట్స్ తీసుకునే పనిలో ఉన్నారట. అలా ఒక్కో రంగంలో అనుభవం, ఆదాయం సంపాదించి పూర్తిస్థాయి సినిమా నిర్మాణ సంస్థగా మారుదామనే ఆలోచన అని తెలుస్తోంది. అయితే ముందుగా చెప్పుకున్నట్లు దీనిపై సంస్థ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన, సమాచారం కూడా లేదు.