టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ అంటే ఆగస్ట్ రెండో వారమే. ఎందుకంటే ఆ వీకెండ్‌ని కీలకంగా చేసుకొని టాలీవుడ్‌లో చాలా చర్చలు జరుగుతున్నాయి, మార్పులు జరగుతున్నాయి. తాజాగా నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను ఆ రోజే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఇప్పటికే ఆ డేట్‌ను మూడు పెద్ద సినిమాలు ఫిక్స్ చేసుకున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ‘అక్కినేని’ సినిమాల వార్ ఆ డేట్‌లో ఉంది. ఇప్పుడు మధ్యలోకి నితిన్ వచ్చాడన్నమాట.
నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను జులై 8 నుండి ఆగస్టు 12కు మార్చారు. ఇటీవల సమంత ‘యశోద’ సినిమాను ఆగస్టు 12న వస్తుందని ప్రకటించారు. దానికంటే ఒక్క రోజు ముందు అంటే ఆగస్టు 11న నాగచైతన్య తొలి హిందీ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ వస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆగస్లు 12న అఖిల్ ‘ఏజెంట్’ కూడా రాబోతోంది. ఈ సినిమా డేట్ కూడా ఎప్పుడో ప్రకటించారు. ఆ లెక్కన అటు చైతన్య, ఇటు అఖిల్… మధ్యలో సమంత వచ్చింది అనుకోవచ్చు.
ఇదంతా పక్కనపెడితే.. అసలు తిరిగి తిరిగి ఆగస్టు రెండో వారానికి చేరుకున్న ఈ సినిమాలన్నీ ఆ రోజు విడుదలవుతాయా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. కారణం చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’. ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలని అనుకుంటున్నారట. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆగస్ట్ రెండో వారం లాంగ్ వీకెండ్ కావడంతో ఆగస్టు 11 మీద చిరంజీవి కన్ను పడిందని చెబుతున్నారు. ‘గాడ్‌ఫాదర్’ సినిమాను ఆ రోజు విడుదల చేసి మంచి వసూళ్లు రాబట్టొచ్చని భావిస్తున్నారట.
మలయాళంలో మంచి విజయం అందుకున్న ‘లూసిఫర్’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. జయం మోహన్‌రాజా ఈ సినిమాను దర్శకుడు. సినిమా చిత్రీకరణ చివరిదశకొచ్చింది. సినిమా గుమ్మడికాయ కొట్టినప్పుడు రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇస్తారని చెబుతున్నారు. సో వెయిట్ సీ.