రణరంగం

వెర్సటైల్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “రణరంగం”. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. శర్వా లుక్స్, టీజర్, ట్రైలర్ తోపాటు సౌండ్ కట్ ట్రైలర్ కూడా సినిమా మీద విశేషమైన అంచనాలు నెలకొనేలా చేసింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: 1995లో అన్న ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధం చేయగానే.. అప్పటివరకూ బ్లాక్ టికెట్స్ అమ్ముకొనే దేవ (శర్వానంద్) & గ్యాంగ్ దొంగతనంగా బ్లాక్ మార్కెట్ లో మందు అమ్మడం మొదలెడతారు. ఆ క్రమంలో ఆల్రెడీ అదే దందాలో ఉన్న ఎమ్మెల్యే సింహాచలం (మురళీశర్మ)కు ఎదురెళ్లాల్సి వస్తుంది. అలా మొదలైన గ్యాంగ్ వార్ చివరికి ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? పవర్ & మనీ కోసం జరిగిన ఈ భీకర “రణరంగం”లో ఎవరు గెలిచారు? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే శర్వానంద్ ఈ సినిమాలో రెండు జనరేషన్స్ కి సంబంధించిన మాఫియా డాన్ గా సబ్టల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు. రౌద్రంతోపాటు హాస్యం కూడా సమపాళ్లలో పండించాడు శర్వా. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్ సరిగా వర్కవుట్ అవ్వకపోయినా.. శర్వా తన కళ్ళు మరియు బాడీ లాంగ్వేజ్ లోని ఇంటెన్సిటీతో ఆకట్టుకొన్నాడు.

కళ్యాణి ప్రియదర్శిని సాంప్రదాయబద్దమైన యువతి పాత్రలో క్యూట్ గా ఉంది. నటిగానూ మెప్పించింది. కాజల్ ను హీరోయిన్ అనేకంటే.. ఎక్స్ టెండెడ్ క్యామియో అనొచ్చు. ఆమె పాత్ర వల్ల సినిమాకి ఒరిగింది ఏమీ లేదనే చెప్పాలి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన “పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్” పాటను తీసుకెళ్లి ఎండ్ క్రెడిట్స్ లో ప్లే చేయడంతో కాజల్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారనే చెప్పాలి. సుదర్శన్ కామెడీ టైమింగ్ సినిమాకి హైలైట్. మురళీశర్మ, అజయ్, బ్రహ్మాజీలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దివాకర్ మణి సినిమాటోగ్రఫీ వర్క్ ను ప్రత్యేకంగా ప్రశంసించాలి. ఆ కెమెరా ఫ్రేమింగ్స్ & యాంగిల్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఎలివేషన్ షాట్స్ ను తన కెమెరా పనితనంతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు దివాకర్. లైటింగ్ & టింట్ కలరింగ్ లలోనూ తనదైన మార్క్ ను చూపించాడు దివాకర్. ఒన్నాఫ్ ది బెస్ట్ కెమెరా వర్క్స్ ఇన్ ది రీసెంట్ టైమ్ గా “రణరంగం” చిత్రాన్ని పేర్కొనవచ్చు.

ప్రశాంత్ పిళ్లై పాటలకంటే నేపధ్య సంగీతం అద్భుతంగా ఉంది. మెయిన్ థీమ్ మ్యూజిక్ అయితే వేరే లెవల్లో ఉంది. థియేటర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ మన చెవుల్లో ఆడుతూనే ఉంటుంది.

నిర్మాణ విలువల విషయంలో నాగవంశీ ఎక్కడా రాజీపడలేదు. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది.

సుధీర్ వర్మ 95 కాలంలో సినిమాను ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చెప్పడం కోసం చిరంజీవి “అల్లుడా మజాకా” రిఫరెన్స్ లు వాడుకోవడం, చాలా సన్నివేశాల్లో చిరంజీవి ఫేమల్ ఓల్డ్ స్టిల్స్ వాడడం బాగుంది. అలాగే “ప్రపంచ శాంతి కోసం కె.ఏ.పాల్ తిరుగుతున్న రోజులవి” అనే డైలాగ్ థియేటర్లో గట్టిగా పేలింది. చంద్రబాబు నాయుడు రిఫరెన్స్ కూడా బాగుంది. కథగా చూసుకొంటే.. షారుక్ ఖాన్ “రయీస్” సినిమాతో కొన్ని పోలికలు కనిపిస్తుంటాయి. స్క్రీన్ ప్లే పరంగా సుధీర్ వర్మ ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. సెకండాఫ్ లో ప్రతి సన్నివేశానికి పాస్ట్ & ప్రెజంట్ అని స్లైడ్స్ వేసి కాస్త కన్ఫ్యూజ్ చేశాడు. ఈ చిన్నపాటి మైనస్ లు మినహాయిస్తే.. సీరియస్ గ్యాంగ్ స్టర్ డ్రామాలు నచ్చే ప్రేక్షకులకు “రణరంగం” ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

విశ్లేషణ: శర్వానంద్ లుక్స్ & యాక్టింగ్ కి సుధీర్ వర్మ ఇంటెన్సిఫైడ్ స్టైలిష్ టేకింగ్ తొడవ్వడంతో.. “రణరంగం” ఒక అల్ట్రా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా నిలిచింది. అన్నీ వర్గాలకు నచ్చే సినిమా కాదిది.. రా & గ్రిట్టీ యాక్షన్ నచ్చేవాళ్ళకి మాత్రం ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

రేటింగ్: 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus