కరోనా వైరస్ కారణంగా చాలాకాలం పాటు థియేటర్లను మూసేశారు. దీని కారణంగా థియేటర్ వ్యవస్థ కూలబడింది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ ఏడాది ఆరంభంలో థియేటర్లు తెరుచుకోవడంతో పరిస్థితులు సద్దుమణుగుతాయని అనుకున్నారు. కానీ మళ్లీ లాక్ డౌన్ పడింది. దీంతో నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలకు అమ్మడం మొదలుపెట్టారు. థియేటర్ వ్యవస్థకు ఓటీటీ సంస్థలు తలనొప్పిగా మారాయి. భారీ ఆఫర్లు ఇస్తుండడంతో నిర్మాతలు తమ సినిమాలను డిజిటల్ రిలీజ్ కు ఇచ్చేస్తున్నారు.
రీసెంట్ గా సురేష్ బాబు నిర్మించిన ‘నారప్ప’ సినిమా కూడా ఓటీటీఓ రిలీజ్ అవుతుందని వార్తలొచ్చాయి. పెద్ద నిర్మాత సురేష్ బాబు కూడా ఇలా చేయడంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు టాలీవుడ్ నిర్మాతలకు విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ క్రమంలో సునీల్ నారంగ్ మాట్లాడుతూ పరోక్షంగా సురేష్ బాబుపై కామెంట్స్ చేశారు.
చిన్న నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలకు అమ్ముకుంటే పర్లేదు కానీ పెద్ద వాళ్లు కూడా అమ్ముకోవడం ఏంటని అన్నారు. దయచేసి థియేటర్లను కాపాడండి అంటూ వేడుకున్నారు. అక్టోబర్ 30వరకు తమ సినిమాలను ఓటీటీలకు అమ్ముకోవద్దని వేడుకున్నారు.