కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో టాలీవుడ్ బాగా టెన్షన్ పడింది. అసలు సినిమాలను రిలీజ్ చేయగలమా..? థియేటర్లు తెరుచుకుంటాయా..? తీర్చుకున్నా.. జనాలు సినిమా చూడడానికి వస్తారా..? ఇలా రకరకాల సందేహాలు ఉండేవి. కానీ ఆ తరువాత ఇలాంటి సందేహాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. థియేటర్లు ఓపెన్ చేసిన కొన్నాళ్లకే ప్రేక్షకులు వేల సంఖ్యలో రావడం మొదలుపెట్టారు. జనవరి నుండి వరుసగా సినిమా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి థియేటర్లు మూతపడ్డాయి.
సెకండ్ వేవ్ ప్రభావం గట్టిగా ఉండడంతో ఎక్కడికక్కడ షూటింగ్ లు ఆగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా పెట్టారు. కానీ టాలీవుడ్ మాత్రం అసలు టెన్షన్ పడడం లేదు. ప్లానింగ్ లు, డిస్కషన్స్ ఎప్పటిలానే సాగుతున్నాయి. ఎక్కడ వీలైనంత అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. జూన్ నెలలో విడుదల చేయాలనుకుంటున్న సినిమాల ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. కరోనా సెకండ్ వేవ్ ఈ నెలాఖరు వరకు ఉంటుందని.. ఆ తరువాత అంతా మామూలు అయిపోతుందని టాలీవుడ్ జనాలు నమ్ముతున్నారు.
పైగా యూనిట్స్ అన్నీ కూడా ప్రభుత్వం ప్లానింగ్ కోసం చూడకుండా ఎవరికి వారు వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారు. స్టాఫ్ లో ఒక్కొక్కరికి 1500 ఖర్చు చేసి మరీ వ్యాక్సిన్లు వేయిస్తున్నారు. ఈసారి థియేటర్ల మీద, షూటింగ్ ల మీద ఆంక్షలు లేవు కాబట్టి కరోనా తగ్గుముఖం పట్టగానే ఎవరికి వారు పనులు మొదలుపెట్టుకోవడమే. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ కరోనా సెకండ్ వేవ్ గురించి పెద్దగా టెన్షన్ పడడం లేదనిపిస్తుంది.