ఇండియన్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమా వసూళ్ల గురించి మాట్లాడుకునేటప్పుడు తొలుత వినిపిస్తున్న మాట ‘ఓవర్సీస్ కలక్షన్స్’. గత కొన్నేళ్లుగా మన వాళ్లు అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడటం, చదువుకోవడానికి, ఉద్యోగాలకు వెళ్లడంతో అక్కడ మనవాళ్ల జనాభా పెరుగుతోంది. ఈ క్రమంలో మన సినిమాలు యూఎస్‌లో వేస్తే భారీ వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఇన్ని మిలియన్లు, అన్ని మిలియన్లు అని లెక్కలు వస్తున్నాయి. వాటిని ఆ హీరోల ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు కూడా. అయితే ఇప్పుడు ఈ మాటలు ఇక వినలేమా? ఏమో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన పని చూస్తే అలానే అనిపిస్తోంది.
విదేశీ సినిమాలపై వంద శాతం సుంకాలు విధిస్తా అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ప్రకటించాడు. అంటే ఇప్పుడు అక్కడ టికెట్ రేట్లు అమాంతం పెరుగుతాయి. భారతీయ సినిమాలకు అమెరికా మార్కెట్ నుండి 40 శాతం వరకు వసూళ్లు వస్తాయనేది ఓ అంచనా. ఇలాంటి సమయంలో టికెట్ రేట్లు డబుల్ అయిపోతే స్క్రీన్లకు రావడానికి ప్రేక్షకులు వెనుకంజ వేస్తారు. దీంతో సినిమాలు అక్కడ రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఈ లెక్కన ఓవర్సీస్ వసూళ్లు అనే మాట టాలీవుడ్‌లో ఇక గతం అని అనుకోవాల్సి వస్తోంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నిజానికి మే నెలలోనే సినిమా రంగంపై టారిఫ్ విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ ప్రస్తావన రాలేదు. దీంతో ఇక ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు అని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఆయన సడన్ బాంబ్ వేశారు. త్వరలో దీని గురించి ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. అమెరికాలో సినిమా షూటింగ్‌లు పెంచి, హాలీవుడ్‌ని బలోపేతం చేయడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నా.. విదేశీ సినిమాల మీద భారీగా ప్రభావం పడుతుంది. కానీ ఇవేవీ ట్రంప్ వినరు.
మన సినిమాలు అమెరికాలో షూటింగ్ జరుపుకోవడం అరుదు. కొన్ని సీన్స్, పాటలు అక్కడ తీసే ఛాన్స్ ఉంటుంది. కానీ మొత్తంగా అక్కడే షూటింగ్ చేయాలి అంటే ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. కాబట్టి అది అసాధ్యం. ప్రస్తుతం అమెరికాలో విదేశీ సినిమాలపై సుంకాలు లేవు. సినిమాల్ని డిజిటల్ గూడ్స్‌గా పరిగణనలోకి తీసుకోవడమే దీనికి కారణం. కానీ ఇప్పుడు సుంకాలు అంటే విదేశీ సినిమా అక్కడ ఇక కనుమరుగు అవ్వొచ్చు అంటున్నారు. లేదంటే స్టార్ హీరోల పెద్ద సినిమాలు మాత్రమే అక్కడ ఆడతాయి. అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బయటకు వస్తే దీని మీద పూర్తి క్లారిటీ వస్తుంది.