వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలో మరో సారి హాట్ టాపిక్ అయ్యారు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో అయన తెరకెక్కించిన “వంగవీటి” సినిమా ట్రైలర్ గాంధీ జయంతి సందర్భంగా విడుదలై చర్చకు తెరలేపింది. “వంగవీటి కత్తి.. కాపు కాసే శక్తి” అనే పాట ద్వారా ట్రైలర్ ని మొదలెట్టి వర్మ డేరింగ్ డైరక్టర్ అనిపించుకున్నారు. ఇందులో ఆనాటి బెజవాడలో పగలతో రగిలిన రెండు వర్గాల పేర్లను యధావిధిగా ప్రస్తావించారు. ‘ నాపేరు రాధ”, నా పేరు నెహ్రూ.. మా అన్నయ్య పేరు గాంధి… ”మన ఇంట్లో ఒకడు తగ్గాడు కాబట్టి.. వాళ్ల కుటుంబంలో కూడా ఒకడు తగ్గాలి.., వాళ్ళు నిన్ను ఏదోకటి చేసే ముందు .. నువ్వే ఏదోకటి చెయ్యాలి.. చంపెయ్ రంగా..” అనే డైలాగులు ఇటు పరిశ్రమలోనూ, అటు విజయవాడలోనూ ప్రకంపనలు కలిగిస్తోంది.
రెండు సామాజిక వర్గాలకు చెందిన గొడవలను వెండితెరపైన చూపించినట్లు ట్రైలర్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇదివరకు అనంతపురం ఫ్యాక్షనిజాన్నిరక్త చరిత్ర ద్వారా చూపించిన వర్మ అందులో పేర్లను యధావిధిగా ప్రస్తావించలేదు. పైగా కల్పిత గాధ అంటూ ప్రచారం చేశారు. కాబట్టి అప్పుడు ఆ చిత్రం బెదిరింపులు, సెన్సార్ దాటుకొని రిలీజ్ అయింది. అయితే “వంగవీటి” మాత్రం సెన్సార్ నుంచి బయటికి వచ్చేటట్టు కనిపించడంలేదు. రెండు సామాజిక వర్గాలకు చెందిన వారు కచ్చితంగా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. పైగా హింసను ప్రేరేపించే విధంగా సినిమా ఉండడంతో సెన్సార్ సభ్యులు సైతం ఈ చిత్రంలో మార్పులు సూచించడం తథ్యం అంటున్నారు.