ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోని క్రేజీ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా నిలబడ్డ విజయ్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీతో స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు. ఆ తర్వాత పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో విజయ్ రేంజ్ మారిపోయింది. అందుకే అమాంతం రెమ్యునరేషన్ పెంచేసినట్టు తెలిసింది. అతను తాజాగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో “నోటా” అనే ద్వి భాష చిత్రాన్ని చేశారు. నాజర్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషించిన ఇందులో మెహ్రీన్ జర్నలిస్ట్ పాత్రలో నటించింది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈనెల 5 న రిలీజ్ కానుంది. ఈ చిత్రం మొదలయ్యేటప్పుడు 50 లక్షలకు ఒకే చెప్పిన విజయ్.. హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో మూడు కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు షికారు చేసాయి.
దీనిపై నేడు విజయ్ స్పందించారు. “ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఈ రోజున నాకు ఇంత గుర్తింపు వచ్చింది. ఈ స్థాయికి రావడమే నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. స్టార్ డమ్ గురించి నేను ఆలోచించడం లేదు. ఆశపడటం లేదు. ఇక ప్రతి సినిమాను ఇదే నా చివరి సినిమా అనుకుని చేస్తాను. సినిమా హిట్ అయింది కదా అని పారితోషికం పెంచేద్దాం అనే ఆలోచనే నాకు ఉండదు. పారితోషికం గురించి ఆలోచిస్తూ వెళితే మంచి సినిమాలు చేయలేము. అందువలన ఆ విషయాన్ని గురించి కాకుండా కథలో కొత్తదనం గురించి ఆలోచిస్తా. అదే నన్ను ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది. పారితోషికం విపరీతంగా పెంచాననే ప్రచారంలో నిజం లేదు” అని స్పష్టం చేశారు. నోటా హిట్ అయితే తమిళనాడులోనూ విజయ్ కి తిరుగుండదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.