అన్ని సినిమాల అప్‌డేట్లు వస్తున్నాయి.. ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా నుండి ఎలాంటి సమాచారం లేదు. దీంతో 2025లో భీమవరం దొరబాబు (‘విశ్వంభర’ చిరు పాత్ర పేరు) రాకపోవచ్చు అనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరకు సినిమా దర్శకుడు మల్లిడి వశిష్ట దగ్గరకు వెళ్లినట్లుంది. అందుకే ఆయన చాలా కాలం తర్వాత సినిమా అప్‌డేట్ ఇచ్చారు. ఒక్క పాట మినహా మొత్తం షూటింగ్ పూర్తయినట్లు ఓ ఆంగ్ల మీడియాతో చెప్పుకొచ్చారు.
అంతేకాదు సినిమాపై ఎలాంటి అప్‌డేట్ లేకపోవడానికి కారణం తామంతా వీఎఫ్‌ఎక్స్ పనుల్లో బిజీగా ఉండటమే అని కూడా చెప్పారు. చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమానే ‘విశ్వంభర’. జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత సినిమా టీమ్ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఈ లోపు చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా మొదలైపోయింది. అందుకే ఈ డౌట్స్ వచ్చాయి.
సినిమాలో 4676 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉన్నాయట. ప్రపంచంలోనే టాప్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీలు దీని కోసం పనిచేస్తున్నాయట. దీంతో అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం పడుతోంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకూడదని మేము భావిస్తున్నాం. చిరంజీవి కూడా వీఎఫ్‌ఎక్స్ షాట్స్ చూసి థ్రిల్ అయ్యారట. ఆ పనులు ఓ కొలిక్కి వస్తే సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని చెప్పాలి.
‘విశ్వంభర’ సినిమా కోసం చిత్ర బృందం 16 సెట్స్ వేసిన విషయం తెలిసిందే. అందులో రూపొందించిన సన్నివేశాలకే ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తున్నారు. అన్నట్లు ఆ మధ్య వచ్చిన టీజర్‌లో వీఎఫ్‌ఎక్స్ షాట్స్ విషయంలో ఫ్యాన్స్, ప్రేక్షకులు పెదవి విరిచారు. అందుకే ఇప్పుడు మళ్లీ వీఎఫెక్స్ పనులు తిరిగి చేస్తున్నారని టాక్. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథన్, సురభి, ఇషా చావ్లా తదితరులు ఇతర కీలక పాత్రధారులు.