అసలు ప్రభాస్ ఏమనుకుంటున్నాడు? వరుసగా అన్నేసి కథలు విని ఏం చేద్దామని? అన్నేసి సినిమాలు ఒప్పేసుకొని ఎప్పుడు రిలీజ్ చేద్దామని? అసలు ప్రభాస్‌కి అంత టైమ్ ఎక్కడ ఉంటోంది? అసలు నిజంగా పుకార్లు వస్తున్నట్లు ప్రభాస్ అన్నేసి కథలు వింటున్నాడా? ఇటీవల వస్తున్న పుకార్లు, వార్తలు వింటుంటే అందరికీ ఇదే అనుమానం వస్తోంది. అభిమానులైతే మా హీరో వరుస సినిమాలు చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. కానీ ఇదంతా నిజమేనా అనే డౌట్ వారి మనసులో తప్పక ఉంటుంది.
ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ ఒకసారి చూసుకుంటే… ‘ఆదిపురుష్’, ‘సలార్’, నాగ్ అశ్విన్ సినిమా. ఇది కాకుండా ‘రాధే శ్యామ్’ ప్రీ ప్రొడక్షన్ పనులు చివరిదకొచ్చాయి. అయితే ఇవి పక్కాగా ఓకే అయిన సినిమాలు మాత్రమే ఇవి కాకుండా ఇటీవల కాలంలో ప్రభాస్ సినిమాలు అంటూ ఇంకొన్ని వినిపిస్తున్నాయి. అందులో ‘మాస్టర్’ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమాల, టైగర్ ష్రాఫ్ చేస్తాడని వార్తలొచ్చిన ‘రాంబో’ రీమేక్, ప్రశాంత్ నీల్‌తో దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా ఉన్నాయి. ఇప్పుడు వీటికి వేణు శ్రీరామ్ సినిమా వచ్చి కలిసింది.
‘వకీల్‌సాబ్’తో ఇటీవల బంపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ ఇటీవల ప్రభాస్‌ను కలిశాడని టాక్. దిల్ రాజు ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందట. అయితే కథేంటి, సినిమా ఏంటి అనే వివరాలుు బయటకు రావడం లేదు. మరోవైపు అల్లు అర్జున్‌తో తీద్దాం అనుకున్న ‘ఐకాన్’ కథనే ప్రభాస్‌కు తగ్గట్టుగా మార్చి వినిపించారనే పుకార్లు కూడా వస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్ అంటున్నారు కాబట్టి ప్రశాంత్ నీల్ సినిమా బదులు వేణు శ్రీరామ్ సినిమా చేస్తున్నారా అనే ప్రశ్నలూ వస్తున్నాయి. కాబట్టి డార్లింగూ.. ఒక చిన్న క్లారిటీ ఇయ్యారాదే.