‘క్రాస్ ఓటింగ్’… సాధారణ రాజకీయాల్లో ఈ మాట చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎం.పి, ఎం.ఎల్.ఎ ఎన్నికలు జరిగినప్పుడు ఈ మాట వింటూ ఉంటారు. అంటే ఎం.పి బ్యాలెట్/ఈవీఎంలో ఒక పార్టీకి ఓటు వేసి, ఎం.ఎల్.ఎ ఎన్నికలో మరో పార్టీకి ఓటు వేస్తుంటారు. దీంతో ఒకే ప్రాంతంలో వేర్వేరు పార్టీలు గెలుస్తుంటాయి. చాలా సందర్భాల్లో ఇలా జరగడం చూసుంటారు. ఇప్పుడు ‘మా’లో కూడా అదే జరిగిందా? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించారు.
కానీ అతనిలో ప్యానల్‌లో అందరూ గెలవలేదు. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లో 11 మంది ఈసీ సభ్యులు గెలవగా, మంచు విష్ణు ప్యానల్‌లో ఏడుగురు గెలిచారు. మిగిలిన కీలక సభ్యుల విషయంలోనూ అదే జరిగింది. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు చెందిన శ్రీకాంత్ గెలిచారు. జనరల్ సెక్రటరీగా గెలిచిన రఘుబాబు ఆధిక్యం కూడా ఏడు ఓట్లే. ఇలా చూసుకుంటే చాలా వరకు క్రాస్ ఓటింగ్ జరిగింది.
ఆ మధ్య ఒకసారి నరేశ్ ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ… ‘ఇప్పటికే వాళ్లలో వాళ్లు కొట్టుకుంటున్నారు’ అని అన్నారు. ఇప్పుడు ఫలితాలు చూస్తే అదే అర్థమవుతోంది. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ ప్రచారం అంతా కలసి చేసినట్లు కనిపించినా… ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి ప్యానల్ సభ్యులు ‘మాకు ఓటేయండి… అధ్యక్ష పదవి ఓటు మీ ఇష్టం’అన్నట్లుగా ఉన్నారు. అలా క్రాస్ ఓటింగ్ ప్రకాశ్‌రాజ్ కొంపముంచింది అంటున్నారు.