విలన్ గా ఇండియా మొత్తం సుపరిచితుడైన సోనూ సూద్ కరోనా టైమ్ లో ప్రజలకు చేసిన సహాయంతో రియల్ లైఫ్ సూపర్ హీరో అయిపోయాడు. జనాలు కూడా అతడ్ని విలన్ గా చూడడానికి ఇష్టపడడం లేదు. దాంతో సోనూ సూద్ కొంత కాలం గ్యాప్ తీసుకొని హీరోగా మాత్రమే కాక దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తెలుగులో సంక్రాంతి సినిమాల మధ్యలో నలిగిపోయి పెద్దగా కనిపించలేదు. ఇంతకీ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
Fateh Review
కథ: పంజాబ్ లోని ఓ మారుమూల గ్రామంలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ, తన చుట్టూ ఉన్న వాళ్లకు అండగా నిలుస్తూ ఉంటాడు ఫతే (సోనూ సూద్). ఆ గ్రామంలో ఒక వ్యక్తి లోన్ యాప్ బెదిరింపుల కారణంగా మరణిస్తాడు. ఆ చావుకి తానే కారణం అని నమ్మిన నిమ్రత్ (శివ్ జ్యోతి).. ఆ లోన్ యాప్ వెనుక ఉన్న మాఫియాను బట్టబయలు చేయడం కోసం ఢిల్లీ వెళుతుంది కానీ.. అప్పటినుండి ఎవరికీ కనిపించదు.
ఆమెను వెతుక్కుంటూ ఢిల్లీ వెళతాడు ఫతే. అప్పుడే ఫతే గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. అసలే ఫతే ఎవరు? లోన్ యాప్ మాఫియాను ఎలా ఎదిరించాడు? అనేది సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా సినిమా మొత్తానికి ఒకే ఒక్క కాస్ట్యూమ్ లో కనిపిస్తారు, ఆయన షూటింగ్ మొత్తం రెండు లేదా మూడు రోజుల్లో తీసేసినట్లుగా ఉంటుంది. విజయ్ రాజ్ ను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. అలాగే.. మరికొంత కొత్త ముఖాలు మెరిసాయి.
సోనూ సూద్ తన క్యారెక్టరైజేషన్ విషయంలో హాలీవుడ్ సినిమాలను మరీ గుడ్డిగా ఫాలో అయిపోయాడు. ముఖ్యంగా.. బాడీ లాంగ్వేజ్ విషయంలో హాలీవుడ్ నటుడు డెంజెల్ వాషింగ్టన్ ను ఇమిటేట్ చేసినట్లుగా కనిపించడం అనేది హాలీవుడ్ సినిమాలు చూసేవారికి పెద్దగా రుచించదు. జాక్వలిన్ పోషించిన టెకీ క్యారెక్టర్ ఆసక్తికరంగా లేదు.
సాంకేతికవర్గం పనితీరు: చిత్ర దర్శకుడు, నటుడు సోనూ సూద్ హాలీవుడ్ యాక్షన్ సిరీస్ “ఈక్వలైజర్” నుంచి మరీ ఎక్కువ స్ఫూర్తి పొందినట్లున్నాడు. కథనం, యాక్షన్ బ్లాక్స్, సీన్ కంపోజిషన్ అన్నీ అచ్చుగుద్దినట్లుగా దింపేశాడు. ఆ కారణంగా ఒక దర్శకుడిగా తన మార్క్ ఏంటి అనేది చూపించుకోలేకపోయాడు. అలాగే.. ఎమోషనల్ సీన్స్ కూడా కొన్ని హాలీవుడ్ సినిమాల కాపీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మిర్రర్ షాట్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా కాపీ సీన్స్ ఉన్నాయి. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాను కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీయాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే.. ఆ కథలో ఎమోషన్ ఏమిటి? ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే పాయింట్ ఏమిటి? చివరివరకు ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టగలిగే హుక్ పాయింట్ ఏమిటి? వంటి విషయాలను కూడా ఒక ఫిలిం మేకర్ గా సోనూ సూద్ సీరియస్ గా తీసుకొని ఉంటే బాగుండేది. ఈ కీలక విషయాలు లోపించడంతో.. సినిమా టెక్నికల్ గా ఎంత బాగున్నా ఓవరాల్ గా అలరించలేక చతికిలపడింది.
సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఒక వెస్ట్రన్ మూవీ ఫీల్ కోసం ఫ్రేమింగ్స్ & లైటింగ్ విషయంలో తీసుకున్న జాగ్రత్త బాగుంది. అలాగే.. ఈ సినిమాకి బ్యాగ్రౌండ్ స్కోర్ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాన్స్ జిమ్మర్ చేయడం అనేది గమనార్హం. అందువల్ల నేపథ్య సంగీతం వింటున్నప్పుడల్లా “డ్యూన్” సినిమా గుర్తుకొస్తుంటుంది. అయితే.. క్వాలిటీ మాత్రం అదిరింది.
అలాగే.. సినిమాలో టెక్నికాలిటీస్ చాలా బాగున్నాయి. సెట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్, కాలర్ గ్రేడింగ్ వంటివన్నీ బాగున్నాయి.
విశ్లేషణ: యాక్షన్ సినిమాల్లో ఎమోషన్ అనేది చాలా కీరోల్ ప్లే చేస్తుంది. ఆ ఎమోషన్ మిస్ అయినప్పుడు ఎంత క్రేజీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నా, ఎన్ని లీటర్ల రక్తం చిందినా సినిమా పెద్దగా ఆకట్టుకోదు. “ఫతే” విషయంలో జరిగిన తప్పు అదే. సోనూ సూద్ తీసుకున్న ఫేక్ లోన్ యాప్స్ అనే టాపిక్ చాలా సీరియస్ అయినప్పటికీ.. దాన్ని ప్రాజెక్ట్ చేసిన విధానంలో సీరియస్ నెస్ కనిపించలేదు. ఆ కారణంగా సినిమా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది.
ఫోకస్ పాయింట్: యాక్షన్ తోపాటు ఎమోషన్ కూడా ఉండాలి సోనూ సాబ్!
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus