‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా తన మార్క్ క్రియేట్ చేశారు అనుదీప్. రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన ‘ప్రిన్స్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో శివ కార్తికేయన్ హీరోగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. నిజానికి ఈ సినిమాను తమిళంలో చిత్రీకరించి.. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారని చెప్పుకోవాలి. శుక్రవారం నాడు ఈ సినిమా విడుదలైంది. ‘ప్రిన్స్’ తెలుగు వెర్షన్ కి తాము ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని భావించారు మేకర్స్.
కానీ నిజానికి రెండు భాషల్లో కూడా ఈ సినిమా పెద్దగా వర్కవుట్ అవ్వలేదనే చెప్పాలి. అదే రొటీన్ కామెడీతో సినిమాను లాగించేశారని.. లాజిక్స్ లేని సినిమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అనుదీప్ మరోసారి ‘జాతిరత్నాలు’ ఫ్లేవర్ తో సినిమా తీసి ఇంప్రెస్ చేయాలనుకున్నారు కానీ ఆ ప్లాన్ బెడిసికొట్టింది. ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. అనుదీప్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయని తెలుస్తోంది.
అది కూడా హారిక హాసిని, మైత్రి మూవీ మేకర్స్ లాంటి బ్యానర్స్ లో చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తన దగ్గర కొన్ని కథలు ఉన్నాయని.. హారిక హాసిని, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ లో సినిమాలు చేయాలని చెప్పారు. హారిక హాసిని సినిమా వెంకటేష్ గారితో అనుకుంటున్నామని.. అయితే ఇంకా కథ ఓకే అవ్వలేదని చెప్పారు. అలానే హీరో రామ్ గారికి ఒక కథ చెప్పాలని పేర్కొన్నారు. మొత్తానికి అనుదీప్ పెద్ద సినిమాలే పట్టేశారు. మరి ఈ కథలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో చూడాలి!