‘మా’ సభ్యురాలిగా ఉన్న కరాటే కళ్యాణీని క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అసోసియేషన్‌లో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘మా’ జనరల్ సెక్రటరీ వై.రఘుబాబు గురువారం కరాటే కళ్యాణీకి సస్పెన్షన్ నోటీసు పంపించారు. ఈనెల 16 జారీ చేసిన షోకాజ్ నోటీసుకు నిర్ణీత గడువు లోపల వివరణ ఇవ్వకపోగా లీగల్ నోటీసు పంపడం ‘మా’ సభ్యుల కోసం నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని సస్పెన్షన్ నోటీసులో పేర్కొన్నారు.
‘ఈ నెల 16 వ తేదీన మేము పంపిన షోకాజ్ నోటీసుకు నిర్ణీత సమయంలోగా వివరణను ఫైల్ చేయడంలో మీరు విఫలం చెందారు. ఆ తరువాత లీగల్ నోటీసులు జారీ చేయగా .. వాటికి కూడా సమాధానం చెప్పకపోవడం మా సభ్యుల కోసం నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. దీనిపై మా అసోసియేషన్ నేడు చర్చించి తక్షణమే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది’ అంటూ కరాటే కళ్యాణికి (Karate Kalyani) ఇచ్చిన నోటీసులో ప్రస్తావించారు. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.
ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహం ప్రతిష్టించడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈనెల 28న ప్రతిష్టించడానికి విగ్రహం కూడా తయారుచేయించారు. అయితే, ఈ విగ్రహ ఏర్పాటును కరాటే కళ్యాణి తీవ్రంగా వ్యతిరేకించారు.
కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వీల్లేదని హెచ్చరించారు. అయితే, ఈ విషయంలో కొందరు కరాటే కళ్యాణీని తప్పుబడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేయడంతో ఆమె చెలరేగిపోయారు. ఎన్టీఆర్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు.