స్టార్ నటీనటులా లేరు, పోనీ దర్శకుడు ఏమన్నా స్టార్ స్టేటస్ ఉన్నవారా.. అంటే కాదు. పెద్ద నిర్మాణ సంస్థ ఏమన్నా బ్యాకప్ ఉందా? అంటే లేనే లేదు. కానీ ఆ సినిమా ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతోంది. తెలుగు సినిమా కాకపోయినా మన తెలుగోళ్లు ఆ సినిమాను తెగ చూసేస్తున్నారు. తమిళతంబీలు అయితే అదిరిపోయింది అంటున్నారు. పనిలో పనిగా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు ఏకండా రూ. 200 కోట్ల వైపు పరుగులు తీస్తోంది.
అన్నట్లు ఆ సినిమా పేరు చెప్పలేదుగా… మలయాళం కుర్రాళ్ల కథ అయిన ‘మంజుమ్మెల్ బాయ్స్’. బడ్జెట్ చాలా తక్కువ అవ్వడంతో రిలీజ్ సమయంలో పెద్దగా సినిమా మీద ఆసక్తి లేదు. కానీ వన్స్ ఇలా థియేటర్లలోకి వచ్చిందో లేదో… సినీ గోయర్స్ బాగా ఇష్టపడిపోయారు. అందుకే భాషాభేదం లేకుండా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మలయాళం సినిమాలో అత్యధిక వసూళ్లు అందుకున్న పిక్చర్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు డబుల్ సెంచరీకి దగ్గరైంది.
ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys) వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.190 కోట్లకు చేరువగా ఉన్నాయి అనేది లేటెస్ట్ టాక్. త్వరలోనే రూ. 200 కోట్ల మార్కును దాటేయబోతోందీ చిత్రం. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మాలీవుడ్ రికార్డు బద్దలైంది. చిదంబరం దర్శకత్వంలో శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపత్, లాల్ జూనియర్, దీపక్ కీలక పాత్రల్లో నటించారు.
16 రోజుల్లో రూ.130 కోట్ల వసూళ్లు అందుకున్న ఈ సినిమా 2018లో వచ్చిన ‘లూసిఫర్’ సినిమా ఆల్‌టైమ్ కలెక్షన్ల (రూ.127 కోట్లు) రికార్డును బద్దలుకొట్టింది. ఆ తర్వాత మోహన్‌లాల్ ‘పులి మురుగన్’ వసూళ్ల (రూ.152 కోట్లు) రికార్డు కూడ దాటేసింది. ఇప్పుడు రూ. 180 కోట్లకుపైగా వసూలు చేసి ‘2018’ సినిమా వసూళ్లు (రూ.177 కోట్లు) కూడా క్రాస్ చేసింది. మరి ఈ బాయ్స్ రూ. 200 కోట్లతో ఆగుతారా? ఇంకా ముందుకెళ్తారా అనేది చూడాలి.