అక్కినేని నాగార్జున ప్రస్తుతం సల్మాన్ అనే కొత్త కుర్రాడిని డైరెక్టర్ గా పరిచారం చేస్తూ ‘వైల్డ్ డాగ్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల కాస్త నెమ్మదించింది. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మర్ కు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్ ను రూపొందించాలని నాగార్జున ఎప్పటినుండో దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో స్క్రిప్ట్ పని చేయిస్తున్నాడు. నిజానికి ఈ సంక్రాంతికే ఆ చిత్రం రావాల్సింది. కానీ కథ ఇంకా ఫైనల్ కాకపోవడంతో కుదర్లేదు.
‘మన్మధుడు2’ విషయంలో జరిగిన తప్పుని ‘సోగ్గాడే చిన్ని నాయన’ విషయంలో జరగకూడదని నాగ్ టైం తీసుకున్నట్టు తెలుస్తుంది. 2016లో సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం 50 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. సీనియర్ స్టార్ హీరోల్లో.. అదీ సోలో హీరోగా 40 కోట్ల పైగా వసూళ్లను రాబట్టిన మొదటి స్థానం నాగార్జునదే. అందుకే ఆ చిత్రం సీక్వెల్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడట. ఇక ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతా బానే ఉంది కానీ.. ఈ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ కు పోటీగా 2021 సంక్రాంతి బరిలోనే విడుదల చెయ్యాలి అని నాగార్జున ప్రయత్నిస్తుండడం చాలా పెద్ద రిస్క్ అని కొందరు ఫిలిం విశ్లేషకులు అలాగే ట్రేడ్ పండితులు నాగార్జునకు తెలిపారట. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ పక్కనే కాకుండా ఓ వారం రోజుల గ్యాప్ తీసుకుని .. అంటే జనవరి 8న ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలవుతుంది కాబట్టి జనవరి 15న సంక్రాంతి పండుగ రోజున ‘సోగ్గాడిని’ థియేటర్లకు దింపితే ప్రాబ్లమ్ ఉండదని నాగార్జున వారికి జవాబిచ్చారట. దీంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలైనట్టు సమాచారం.