మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేస్తోన్న కమెడియన్ పృథ్వీరాజ్ ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధికి ఫోన్ చేసి మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో అధ్యక్షుడిగా పోటీ చేస్తోన్న ప్రకాష్ రాజ్ ను ఇటీవల విశాఖకు చెందిన ఏపీ ‘మా’ సన్మానం చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో మద్దతు మీకేనని ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో పృథ్వీరాజ్ ఏపీ ‘మా’ ప్రతినిధికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ క్రమంలో మీడియాలో పృథ్వీరాజ్ ఫోన్ కాల్ అంటూ ఓ ఆడియో ఫైల్ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోన్ కాల్ ప్రకారం.. పృథ్వీరాజ్ ఏపీ ‘మా’ ప్రతినిధితో మాట్లాడినట్లుగా ఉంది. ప్రకాష్ రాజ్ కి సన్మానం చేయడం బాధగా అనిపించిందని.. పాతికేళ్లుగా ఓటు వేయని వ్యక్తి ప్రకాష్ రాజ్ అని అన్నారు. కోవిడ్ సమయంలో మేమంతా ఇంటింటికి వెళ్లి సేవల చేశామని.. బాధితులను బెడ్ లు ఇప్పించమని.. ఇన్ని సేవలు చేస్తే తెలుగువాడు అధ్యక్షుడిగా వద్దా..? అని ప్రశ్నించారు. అతడికి సన్మానం చేయడమే కాదు.. వీడియోల్లో ‘విష్ణు ఎవడు’ అని థంబ్ ఫోటో పెట్టించారని మండిపడ్డారు.
అతడిలో ఏం చూసి మీరు ‘మా’ మద్దతు మీకు ఉందని చెబుతారు..? అంటూ నిలదీశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్స్ లో ఆయన్ను సస్పెండ్ కూడా చేశారని అన్నారు. కన్నడ సినిమాలో తను లేడీ గెటప్ వేస్తే విగ్గు లాగేసి.. కన్నడవాళ్లే నటించాలని ప్రకాష్ రాజ్ అన్నారని.. దీంతో సిగ్గుతో వచ్చేశానని పృథ్వీ అన్నారు. భారతదేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు కానీ మన మీద పోటీ చేయకూడదని అన్నారు. అతడు మీకు అంతగా నచ్చాడా..? మేం కూడా వైజాగ్ కి షూటింగ్ కు వస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆ ఫోన్ కాల్ వాయిస్ లో ఉంది.